హర్యానాలో హంగ్
న్యూఢిల్లీ,
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ సాగింది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో.. బీజేపీ 42 స్థానాల్లో.. కాంగ్రెస్ 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే అనూహ్యంగా జేజేపీ పార్టీ మాత్రం అధికార పార్టీకి జలక్ ఇచ్చింది. దుశ్యంత్ నేతృత్వంలోని ఆ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. దీంతో హర్యానా పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా.. హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో సీఎం ఖట్టర్ .. హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాలి. మిషన్ 75 టార్గెట్‌తో బీజేపీ ప్రచారం నిర్వహించినా.. ఆ టార్గెట్‌ను అందుకోలేకపోయారు. ప్రధాని మోదీ.. హర్యానాలో ఏడు ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా జాట్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం హంగ్ ఏర్పడడంతో.. బీజేపీ కూడా జేజేపీని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అకాలీదళ్, బీజేపీ, జేజేపీ గతంలో కూటమిగా ఏర్పడాలని భావించాయి. తాజా ఫలితాల్లో జేజేపీ కీలకంగా మారడంతో.. దుశ్యంత్‌ను చేరుకోవాలని బీజేపీ చూస్తున్నది.
ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. సమాజ్‌వాదీ రెండు స్థానాల్లో, బహుజన్ సమాజ్, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు నెగ్గిన బీజేపీ.. ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేసింది. కానీ కేవలం ఆరు స్థానాల్లో మాత్రం ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్నది. మొత్తం 11 స్థానాల్లో.. బీజేపీ 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్‌పీ మాత్రం అన్ని సీట్లలో పోటీ చేశాయి.