YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదు

ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదు

ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదు
మెడమీద తలకాయ ఉన్నవాళ్లెవరూ ఇలాంటి సమ్మెలు చేయరు
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం 
హైదరాబాద్ 
 ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మెడమీద తలకాయ ఉన్నవాళ్లెవరూ ఇలాంటి సమ్మెలు చేయరని, ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని కొట్టిపారేశారు. ఎస్మా ఉండగా సమ్మెకు పోవడం కరెక్ట్‌ కాదని 2600 బస్సులు రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని, వాటికి రూ. వెయ్యి కోట్లు అవసరమన్నారు. పాత ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల చిల్లరరాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపుపై మాట్లాడిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆర్టీసీ యూనియన్ల పేరుతో వాళ్లు చేస్తుంది మహానేరమని మండిపడ్డారు. జీవితాలతో ఆడుకుంటున్నారని, కార్మికుల గొంతు కోస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని స్వయంగా వాళ్లే ముంచుకుంటున్నారని, మీ సంస్థను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండని పిలుపునిచ్చారు. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఉన్నప్పుడు ఫోన్‌ కనెక్షన్‌ కావాలంటే నెలలు పట్టేదని, ప్రైవేట్‌ సంస్థలు వచ్చాక సదుపాయాలు పెరిగాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండాలంటే పోటీ ఉండాల్సిందేనన్నారు. ప్రైవేట్‌ బస్సుల పోటీని తట్టుకుని నిలబడితేనే ఆర్టీసీ మిగులుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్ తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్‌ మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆగ్రహించారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు.
నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.4 కోట్లు నష్టం వస్తోందని. ప్రైవేట్‌ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. దిక్కుమాలిన నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీని ముంచుతామని, నువ్వు కాపాడుకో అన్నట్లుగా కార్మికుల ధోరణి ఉందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.50 వేల జీతం వస్తుందని, అవసరం అయినప్పుడు ఒక గంట ఎక్కువ పనిచేయలేరా అని నిలదీశారు. మా కాళ్లు మేమే నరుక్కుంటాం అన్నట్లు వ్యవహరించవద్దని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు.ఆర్టీసీ కార్మికులు పిచ్చి పంథా ఎంచుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. అనవసరమైనటు వంటి, అర్థంపర్థం లేనటువంటి, దురహంకార పద్ధతిని అవలంబిస్తున్నారని సమ్మె చేస్తున్న వారిని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేషజాలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, ఆర్థికమాంద్యం వచ్చిందన్న విషయాన్ని ప్రగల్భాలు లేకుండా నేరుగా ప్రజలకు చెప్పానని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికుల ధోరణి సరికాదని చెప్పారు.

Related Posts