చందనది పరువు హత్యే
తిరుపతి,
చిత్తూరు జిల్లా వరుస పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలిసీతెలియని వయసులో తప్పటడుగులు వేస్తున్న పిల్లలను దారిలోపెట్టాల్సిన తల్లిదండ్రులు పగ, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. పరువు పేరుతో అభంశుభం తెలియని పసి హృదయాలను నులిమేస్తున్నారు. కాటికి పంపి కన్నపేగును దూరం చేసుకుంటున్నారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచి జైలుపాలవుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పరువు హత్యలు పెచ్చుమీరుతున్నాయి. మొన్న పలమనేరు ఘటన మరువక ముందే తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రెడ్లపల్లి చందన కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని తండ్రే ఆమెను అమానుషంగా కడతేర్చాడు.చందన ఆత్మహత్య చేసుకుందని నమ్మించడమే కాకుండా ఆనవాళ్లు మిగలకుండా మృతదేహాన్ని కాల్చివేసి, బూడిదను చెరువులో కలిపేశాడు.
శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్లపల్లిలో ఎనిమిది రోజుల క్రితం డిగ్రీ చదువుతున్న చందన(17) హత్యకు గురైంది. తొలుత ఇది ఆత్మహత్యగా భావించారు. పోలీసు విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. రెడ్లపల్లికి పొరుగున ఉన్న దళిత కాలనీకి చెందిన ప్రభు అలియాస్ నందకుమార్(18) ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం చందన ఇంట్లో తెలిసి ఆమెను తల్లిదండ్రులు మందలించారు. దీంతో చందన, నందకుమార్ ఈ నెల 11న ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన చందన తండ్రి వెంకటేశ్ తన బంధువులతో కలిసి వెళ్లి...కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లాడు.నందకుమార్‌ని స్వగ్రామానికి పంపించివేశారు. ఆ తర్వాత తాము చెప్పినా వినకుండా దళితుడిని పెళ్లి చేసుకుంటావా అంటూ...చందనను చితకబాదాడు. ఆవేశంలో గొంతుకు తాడు బిగించి హతమార్చాడు. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు భార్యతో కలిసి చందన ఇంట్లో ఉరి వేసుకున్నట్లు గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రికి రాత్రే ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఆపై శవాన్ని కాల్చి బూడిదను గోనె సంచుల్లో నింపి కర్ణాటకలోని క్యాసంబళ్లి చెరువులో పడేశాడు. పోలీసుల విచారణలో కుటుంబ సభ్యుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. కన్నకూతుర్ని కిరాతకంగా హతమార్చిన తండ్రితో పాటు, అతడికి సహకరించినవారంతా జైలుపాలయ్యారు