నిలువుదోపిడీ (కరీంగర్)
కరీంనగర్, : రైతాంగానికి ఏటా నిర్వేదమే ఎదురవుతోంది.. ఎండనక వాననక కష్టపడే అన్నదాతకు మిగిలేది అప్పులైతే.. ఎలాంటి శ్రమ లేకుండా కొనుగోలు చేసే దళారులు మాత్రం చేతినిండా సంపాదించుకుంటున్నారు. దీపావళి పండగ క్రమంలో ఇంటి ఖర్చులకని పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళ్తే ప్రభుత్వ యంత్రాంగ కొనుగోళ్లు లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా అందినకాడికి దోచుకుంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు కావాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడా కానరాకపోవడం విడ్డూరం. కనీస మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితమవడంతో జిన్నింగ్ మిల్లులు, పల్లెల్లోని దళారులు రైతన్నలని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, గంగాధర తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు కర్షకుల నోట్లో మట్టిగొడుతున్నారు. తేమ సాకుతో క్వింటాల్‌కు సాధ్యమైనంత మేర దండుకుంటుండగా ఏం చేయలేని నిస్సహాయ స్థితి రైతన్నది. పత్తి, మొక్కజొన్న, ధాన్యం పంటలను అవసరాల క్రమంలో అమ్ముకునేందుకు చూస్తే ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. పత్తికి కేంద్రం క్వింటాల్‌కు రూ.5550 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ ఆచరణలో దక్కుతుంది మాత్రం రూ.3500 నుంచి రూ.4500 మాత్రమే. మార్కెట్లలోనే పత్తిని కొనుగోలు చేయాలని, వేరేచోట కొనుగోలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించినా మార్పులేదు. వరికి సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.1815 కాగా రూ.1300-1450, గ్రేడ్ ఏ రకానికి రూ.1835 కాగా రైతుకు దక్కేది రూ.1350-1480 మాత్రమే. ఇక మొక్కజొన్నకు రూ.1760 కాగా రూ.1400లకు మించి కొనడం లేదు. ఇదేంటంటే తేమ సాకును చూపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
జిల్లాలో అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. జిల్లాలో 85,000 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న 13 వేల హెక్టార్లలో సాగు కాగా కూలీల ధరలు ఆకాశన్నంటడంతో ప్రతి రైతు తొలి పత్తి తీతలో ఎకరాకు రూ.2,000 వరకు నష్టపోయారు. పంటతీత నుంచి విక్రయం వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు గులాబీ, ఎర్రతెగులు సోకడం, వాటిని నివారించేందుకు పురుగు మందుల వెంట పరుగులు తీశారు. అ దనపు వ్యయం తప్పకపోగా తెగుళ్ల కట్టడి నామమాత్రంగానే మిగిలింది. దీంతో ఎకరాకు 10-15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పత్తి తెగుళ్లతో 8 క్వింటాళ్ల వరకు వస్తుందని తెలుస్తోంది. పల్లెలు, జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల్లోనే దోపిడీ అనుకుంటే వ్యవసాయ మార్కెట్లలోనూ అదే దుస్థితి.. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, గంగాధర, చొప్పదండి, గోపాల్‌రావుపేట, మానకొండూరు మార్కెట్లలోనూ రైతుకు భరోసా కరవైంది. తేమ సాకుతో ఇష్టారీతిగా ధరలను నిర్ణయిస్తున్నారు. పత్తి కొనుగోళ్లు లేకపోగా ధాన్యం, మొక్కజొన్న రైతులను బహిరంగంగా దోచుకుంటున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో రైతన్నకు బాసటగా నిలువాల్సిందిపోయి తేమ పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నా వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాలు ఏం పట్టనట్లు చూస్తున్నాయి. కనీస మద్దతు ధరకు రూ.వెయ్యి నుంచి రూ.1500లకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి మార్కెట్లకు మరో 11 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేయాల్సి ఉండగా నేటికీ అతీగతి లేదు. దీపావళి తర్వాతే పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.