YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వరుస తప్సటడుగులతో వంగవీటి

వరుస తప్సటడుగులతో వంగవీటి

వరుస తప్సటడుగులతో వంగవీటి
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా దైన్య స్థితిలో ఉంది. జనసేన పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. అదే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఎటూ తేలకుండా ఉంది. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన వంగవీటి రాధా మరో పార్టీకి జంప్ చేస్తారా? లేక ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? అన్న చర్చ రంగా అభిమానుల్లో జరుగుతోంది. వంగవీటి రాధా అయితే ఇప్పటి వరకూ టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.వంగవీటి రాధా ఒకప్పుడు తండ్రి వంగవీటి రంగా పేరుతో వెలిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బ్రాండ్ అంబాసిడర్ గా వంగవీటి రాధాను చెబుతారు. అదే వంగవీటి రాధాకు రాజకీయంగా కలసి వచ్చింది. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ఆ తర్వాత వరసగా తప్పటడుగులు వేశారు. 2009 ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యాన్ని తిరిగి కాంగ్రెస్ లో కలిపేయడంతో వంగవీటి రాధా తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు.2019 ఎన్నికలకు ముందు వరకూ వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఆశించినా అది రాదని తెలియడంతో వంగవీటి రాధా తన అనుచరులతో హడావిడి సమావేశాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఎంపీగానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ గాని ఇస్తామని వైసీపీ అధినాయకత్వం నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వంగవీటి రాధా ససేమిరా అన్నారు. చివరకు ఎన్నికలకు ముందు వైసీపీని వీడి వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అక్కడ టిక్కెట్ ఇవ్వకపోయినా అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ ఆఫర్ చేసింది. అయితే వంగవీటి రాధా వద్దనడంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వంగవీటి రాధాకు సాక్షాత్తూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా వంగవీటి రాధా విస్తృతంగానే పాల్గొన్నారు.ఎన్నికల పోలింగ్ ముగిశాక వంగవీటి రాధా యాగాన్ని కూడా నిర్వహించారు. కానీ ఫలితాలు వైసీపీ వైపు వచ్చాయి. దీంతో వంగవీటి రాధాకు సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ వచ్చే అవకాశమూ కన్పించడం లేదు. అందుకే వంగవీటి రాధా టీడీపీలో యాక్టివ్ గా లేరు. దీనికి తోడు కొంతకాలం క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. అయితే ఇంతవరకూ జనసేనలో చేరుతున్నట్లు వంగవీటి రాధా ప్రకటించలేదు. విజయవాడలోనే ఉంటున్నా వంగవీటి రాధా టీడీపీ అధినేతను కలిసే ప్రయత్నం ఐదు నెలలుగా చేయడంలేదు. ఎన్నికలకు ముందు తిరిగి యాక్టివ్ కావచ్చన్నది వంగవీటి రాధా ఆలోచనగా ఉంది. మొత్తం మీద రంగా అభిమానులకు రాధా రాజకీయం అర్థం కాకుండా ఉంది.

Related Posts