YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నీరున్నా.. బేజారే..

నీరున్నా.. బేజారే..

నీరున్నా.. బేజారే..
కాకినాడ, : జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో రక్షితనీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నా పలు కారణాలతో ఫలితంఉండడం లేదు. ఏళ్ల కిందట వేసిన పైపులైన్లు పగుళ్లివ్వడం, సరఫరాలో లోపాల కారణంగా నగర, పురపాలక సంఘాల్లో తాగునీరు కలుషితమవుతోంది. ఈ విషయంలో శాశ్వత చర్యలపై యంత్రాంగం దృష్టి నిలపడం లేదు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో పురాతన పైపులైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండడంతో తరచూ లీకేజీ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. మిగిలిన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రపురం పెద్దాపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల హోదాలో ఉన్నాయి. వీటి పరిధిలో ప్రజలకు 1,43,993 కొళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
కాకినాడ నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. 1.01 లక్షల కుటుంబాలున్న నగరంలో జనాభా 3.70 లక్షలకు చేరింది. 50,875 కొళాయిల ద్వారా నిత్యం 40 ఎంఎల్‌డీల తాగునీటిని రెండు పూటలా సరఫరా చేస్తున్నారు. కాకినాడలో 1903లో స్థాపించిన విక్టోరియా వాటర్‌ వర్క్స్‌ ద్వారానే నేటికీ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురాతన పైపులైన్లు కావడంతో పలుచోట్ల పగిలి డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తోంది. దీంతో కలుషిత నీరు కొళాయిల ద్వారా సరఫరా అవుతుండటంతో దీనిని తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాకినాడలో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల్లో జాప్యం కారణంగా ఈ తరహా సమస్యలు అధికమవుతున్నాయి. దీనికితోడు నగరంలోని కుటుంబాలకు పూర్తి స్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల తాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని నగరపాలక సంస్థ నిర్దేశించుకున్నా ప్రస్తుతం 95 లీటర్ల వరకు మాత్రమే అందించగలగుతున్నారు. గతంలో శివారు ప్రాంతాలను దాహార్తి వెంటాడేది. దుమ్ములపేట, సంజీవ్‌నగర్‌, జె.రామారావుపేట, ముత్తానగర్‌, ఏటిమొగ తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. ప్రస్తుతం పైపులైన్ల విస్తరణతో దుమ్ములపేట, సంజీవ్‌నగర్‌ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ సమస్యపై దృష్టిసారించాల్సి ఉంది. తాజాగా పైపులైన్ల విస్తరణకు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం కింద రూ.కోట్లు మంజూరు చేసినా ఇంకా పలు చోట్ల సమస్య అధికంగా ఉంది.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి ఉన్న 4.11 లక్షల జనాభా అవసరాలకు రోజుకు 65 మిలియన్‌ లీటర్ల నీటిని 48 వేల కొళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నగరంలో తాగునీటి శుద్ధీకరణ వ్యవస్థ బ్రిటిష్‌ కాలం నాటిది కావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. పురాతన పైపులైన్లను మార్చి ఆధునికీకరణతో తాగునీటిని అందించాలంటే రూ.200 కోట్లకుపైనే ఖర్చవుతుందని అంచనా. రహదారుల విస్తరణతో పైపులైన్లు రోడ్ల మధ్యలోకి రావడం.. భారీ వాహనాల ఒత్తిళ్లకు తరచూ పైపులైన్లు పగిలి పోతుండడంతో లీకేజీ సమస్యలు తెరపైకి వస్తున్నాయి.దీంతో తరచూ కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఇటీవల పుష్కరఘాట్‌ వద్ద ప్రధాన పైపులైను లీకైంది. .
 తుని పరిధిలో జనాభా 60 వేలకు చేరింది. 4,440 వ్యక్తిగత కొళాయిలు, 342 వీధి కొళాయిల ద్వారా నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలో తరచూ పైపులైన్లు పగిలిపోతున్నాయి. జనరల్‌ మార్కెట్‌, గొల్లప్పారావు కూడలి, జీఎన్‌టీ రోడ్డు, పోలీస్‌స్టేషన్‌ కూడలి తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురువుతోంది. దీంతో ప్రధాన పైప్‌లైను తొలగించి రూ.1.35 కోట్లతో కొత్త పైపుల ఏర్పాటుకు పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. శివారు ప్రాంతాలకు పైపులైన్ల విస్తరణ జరగాల్సి ఉంది. మండలంలోని రేఖవానిపాలెంలో పంప్‌హౌస్‌ తాండవ నది ఒడ్డున ఉండటంతో నీటిని శుద్ధిచేసే సంపులోకి బురద చేరుతోంది. దీంతో రక్షితనీటి పథకం తరచూ మరమ్మతులకు గురవుతోంది. పిఠాపురం పట్టణంలో 40 ఏళ్ల కిందట వేసిన పైపులైన్లు తుప్పు పట్టడంతో తరచూ లీకవుతున్నాయి. గుట్లవీధి, మంగాయమ్మరావుపేట, అగ్రహారం, రామ థియేటర్‌ కూడలి తదితర ప్రాంతాల్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. పెద్దాపురానికి సామర్లకోటలోని సాంబమూర్తి రిజర్వాయర్‌ నుంచి పైపులైను ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. 2007లో పైపులు ఏర్పాటు చేయగా సాంకేతిక లోపాల కారణంగా పలు చోట్ల లీకవుతున్నాయి.
 రామచంద్రపురంలో 27 వార్డులు ఉండగా శివారులో ఉన్న 12 వార్డులకు నీటి సమస్య తప్పడం లేదు. రూ.32 కోట్లతో 2009లో ప్రారంభించిన వెల్ల మంచినీటి పథకం నేటికీ కార్యరూపం దాల్చలేదు. అమలాపురంలో పైపులైన్లు తరచూ లీకవుతున్నాయి. ముఖ్యంగా 5, 6, 7 వార్డుల పరిధిలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముమ్మిడివరం గేటు నుంచి మహీపాల వీధి వరకు తరచూ పైపులైన్లు లీకవుతున్నాయి. ఒట్టిగూడెంలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. రూ.30 లక్షలతో ఆరు నెలల కిందట పైపులైను ఏర్పాటుచేసినా నేటికీ అందుబాటులోకి రాలేదు. ముమ్మిడివరం నగర పంచాయతీలోని శివారు వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం అరగంటకు మించి తాగునీటిని సరఫరా చేయడం లేదు. దీనికితోడు కలుషిత నీరు సరఫరా అవుతోంది.

Related Posts