YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

మార్కెట్ మాయ (ఖమ్మం)

మార్కెట్ మాయ (ఖమ్మం)

మార్కెట్ మాయ (ఖమ్మం)
ఖమ్మం, : తొలకరి వర్షాలు ఊరించకపోయినా మార్కెట్లో పత్తి ధరలు మురిపించాయి. తెల్లబంగారంతో అప్పులన్నీ తీరుతాయనే ఆశతో అన్నదాతలు పత్తిని సాగు చేశారు. తొలుత వర్షాభావ పరిస్థితులతో ఒకటికి రెండుసార్లు విత్తనాలు పెట్టారు. తరవాత వర్షాలు ఊపందుకోవడంతో కొంతవరకు గట్టెక్కామని ఆనందించే లోపే అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పంట పచ్చగా ఉన్నా అధిక వర్షాలతో లద్దెపురుగు, గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్ల బారిన పడుతుండటంతో ఇబ్బందిగా మారింది. వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో భూమిలో తేమశాతం అధికమై పూత అధికంగా రాలిపోవడం, ఉన్న కొద్ది కాయలు నల్లబడుతుండటంతో దిగుబడిపై ప్రభావం పడనున్నది. ఆగస్టులో పది మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువుంటే సెప్టెంబరులో రెట్టింపు వర్షపాతం నమోదైంది. కూసుమంచి, చింతకాని, అర్బన్‌, కొణిజర్ల, కల్లూరు, వేంసూరు, తల్లాడ, వైరా, బోనకల్లు, మధిర మండలాల్లో ఆగస్టులో లోటు ఉంది. సెప్టెంబరులో దాన్ని అధిగమించి వర్షపాతం నమోదైంది. పది మండలాల్లో కల్లూరు తప్ప మిగతా మండలాలన్నీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. జిల్లా సగటు సాధారణ వర్షపాతం 161మి.మీ కాగా 247.7మి.మీ. నమోదై 53.6 శాతం అధికంగా వర్షం పడింది. కామేపల్లి, తిరుమలాయపాలెం, చింతకాని, వేంసూరు, కొణిజర్ల, పెనుబల్లిలో ఎక్కువ మొత్తంలో వర్షం పడింది. కల్లూరు మాత్రం 7 శాతం లోటు ఉంది. ఆగస్టులో వేంసూరు మండలంలో 5.7 శాతం లోటు ఉండగా సెప్టెంబరులో 174.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇదే మాదిరిగా చింతకాని మండలంలో ఆగస్టులో 19.7శాతం లోటు ఉండగా సెప్టెంబరులో 85.4 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.అధిక వర్షాలతో పత్తి విపరీతంగా ఎదిగింది. దీంతో రైతులు కూలీలను పెట్టి పెరిగిన పత్తి చివర్లు తుంచారు. భూమిలో తేమ ఎక్కువగా ఉండటంతో పూత కూడా అధికంగా రాలిపోయింది. మాగాణి భూములు, ఇతర వర్షాధార భూముల్లో వేసిన పత్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపో యింది. పత్తి సాగు నుంచి ఇప్పటి వరకు ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరసగా వర్షాలు పడుతుండటంతో తెగుళ్లు, పురుగుల ఉద్ధృతి అధికంగా పెరిగింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రాకపోవడంతో రైతులు విచ్చలవిడిగా రసాయనాలు చల్లారు. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. ఆగస్టులో సాధారణంగానే వర్షపాతం ఉండటంతో పత్తిపై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. సెప్టెంబరు ప్రారంభం నుంచి నేటి వరకు వరసగా తుపాన్లు, అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు అధికంగా పడ్డాయి. దీంతో ఆశలు తెల్లబోయాయి.
పత్తి ధరలు గత రెండు నెలల క్రితం మురిపించాయి. ప్రస్తుతం కూడా క్వింటా పత్తి ధర రూ.6వేల వరకు పలుకుతుంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 88259 హెక్టార్లలో రైతులు పత్తి సాగుచేశారు. ఏన్కూరు, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌, చింతకాని, బోనకల్లు, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో అధికంగా పత్తి సాగుచేస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ప్రస్తుతం పూత, పిందె రాలిపోవడమే కాకుండా ఉన్న కాయలు నల్లబడి కుళ్లు పోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసిన ఇంతవరకు అదుపులోకి రావడంలేదని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు అక్టోబర్‌ మొదటి వారంలోనే మొదటి దశ పత్తి తీయాల్సి ఉండగా ఇంతవరకు సరిగ్గా కాపు లేదు. మరో పదిహేను రోజుల వరకు మొదటి దశ పత్తికి సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వైపు తెగుళ్లు, మరోవైపు పూతలేకపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కౌలు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదని వాపోతున్నారు.

Related Posts