సుజనతో వల్లభనేని వంశీ భేటీ
విజయవాడ,
ఏపీలో పాగా వేసేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తోంది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీతో పాటూ మిగిలిన పార్టీల నుంచి నేతల్ని పార్టీలోకి చేర్చుకుంటోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి కమలం పార్టీలోకి వలసలు షురూ అయ్యాయి. నాలుగు రోజుల క్రితమే రాయలసీమ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి బీజేపీ గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీని కలవడం ఆసక్తికరంగా మారింది. గుంటూరులో ఎంపీ సుజనా చౌదరితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఒంగోలు వెళుతూ గుంటూరులో ఆగిన సుజనాను కలిసిన వంశీ.. కొద్దిసేపు సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి ఒంగోలు వెళ్లినట్లు తెలుస్తోంది. వంశీ సుజనానకు కలవడం.. సమావేశం కావడం.. ఒకే కారులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది. వంశీ పార్టీ మారబోతున్నారా అంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది.వంశీపై కొద్ది రోజుల క్రితమే ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని వల్లభనేని చెప్పారు. ఈ క్రమంలో గురువారం అనుచరులు, అభిమానులతో నియోజకవర్గంలో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీ మారతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.. ఆయన మాత్రం పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారట. ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ ఎంపీని కలవడం ఆసక్తిరేపుతోంది.అంతేకాదు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఇసుక కొరతను నిరసిస్తూ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా వల్లభనేని సుజనాకు కలవడం హాట్‌టాపిక్ అయ్యింది. గతంలో కూడా వెంకయ్య, సుజనాలను వంశీ రెండు,మూడు సార్లు కలిశారు. అప్పుడూ ఇలాగే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్ని వంశీ కూడా తోసిపుచ్చారు. మరి సుజనాను కలవడంపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.