YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మూడు రాష్ట్రాల్లో  మజ్లీస్ పాగా

మూడు రాష్ట్రాల్లో  మజ్లీస్ పాగా

మూడు రాష్ట్రాల్లో  మజ్లీస్ పాగా
హైద్రాబాద్, 
హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న మజ్లిస్ పార్టీ దేశంలో తన ఉనికిని ఘనంగా చాటింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ బీహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో తన సత్తా చాటింది. కిషన్‌గంజ్‌లో విజయం సాధించడం ద్వారా బీహార్‌ అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టనుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు స్థానాలను నిలుపుకోగా.. పలు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే.. కాంగ్రెస్ కూటమి ఓట్లను భారీగా చీల్చి ఒక రకంగా బీజేపీకి మేలు చేసింది. మహారాష్ట్రలో సిట్టింగ్ స్థానం కోల్పోవడం ఆ పార్టీ అధినేను అసంతృప్తికి గురి చేసింది.బీహార్‌లోని కిషన్ గంజ్ విజయం తమకు చాలా సంతోషం కల్గించిందని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ విజయం దక్కని నేపథ్యంలో.. ప్రస్తుతం తొలిసారిగా ఓ స్థానాన్ని గెలుపొందడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతేకాకుండా కిషన్‌గంజ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని మూడో స్థానానికి పరిమితం చేయడం తాము సాధించిన మరో ఘనత అని ఒవైసీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లు బీజేపీకి ఓ గుణపాఠం లాంటివని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మోదీ మంత్రం అన్నివేళలా పనిచేయదని ఈ ఎన్నికలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. హర్యానాలో ప్రధాని మోదీ 12 ఎన్నికల సభల్లో పాల్గొన్నా.. తగిన మెజార్టీ సాధించలేకపోయారని.. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి ఓట్ల శాతం భారీగా పడిపోయిందని విమర్శించారు. ఇకనైనా మేల్కొని అభివృద్ధి, ఎకానమీ గ్రోత్‌పై దృష్టి సారించాలని సూచించారు.మహారాష్ట్రలోని ధూలే సిటీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి షా ఫరూక్ అన్వర్ విజయం సాధించారు. మాలేగావ్ సెంట్రల్ నుంచి మొహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలీ గెలుపొందారు. అయితే.. సిట్టింగ్ స్థానం ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అబ్దుల్ గఫార్ ఖాద్రీ సయ్యద్ పరాజయం పాలవడం ఎంఐఎం శ్రేణులను నిరాశపరిచింది. ఈ స్థానంలో కాంగ్రెస్ -ఎన్సీపీ, బీజేపీ -శివసేన పరస్పరం సహకరించుకొని తమ పార్టీ అభ్యర్థిని ఓడించాయని అసదుద్దీన్ ఆరోపించారు.బీహార్‌లోని కిషన్‌గంజ్ నుంచి ఎంఐఎం అభ్యర్థి కమర్ ఉల్ హుడా 10,204 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతం నుంచి ఐదు స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ.. ఏ ఒక్క చోటా గెలుపొందలేదు. ఈ నేపథ్యంలో ఈ విజయం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమైంది.తాజా విజయాలతో ఎంఐఎం పార్టీ మూడు రాష్ట్రాల్లో పాగా వేసినట్లైంది. తెలంగాణలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర, బీహార్‌లో తన ఉనికి చాటింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలో జరిగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీ అధినేత దృష్టి సారించారు.

Related Posts