పేరుకుపోయిన కోట్లు (మహబూబ్ నగర్)
మహబూబ్ నగర్, : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తుంది. దాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అందిస్తుంది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు క్వింటా బాయిల్డ్ రైస్ కు రూ.50, సాధారణ బియ్యానికి రూ.30 చెల్లిస్తున్నారు. నాలుగు సీజన్‌లుగా ఈ మిల్లింగ్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించలేదు. కమీషన్ డబ్బు 2016-17 రబీ, ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.4.50 కోట్లు బకాయిలు ఉండటంతో మిల్లర్లు తమకు మిల్లింగ్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. బియ్యం మిల్లింగ్ పరిశ్రమ జిల్లాలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని మిల్లర్లు వాపోయారు.
ఇప్పటికే జిల్లాలో మిల్లులు ఇబ్బందుల్లో ఉన్నట్లు కొందరు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు, రవాణాతో పాటు కార్మికుల కూలీ ఛార్జీలు పెరగడంతో పరిశ్రమకు అనేక మంది మిల్లర్లు దూరం అవుతున్నారని అంటున్నారు. గతానికి ప్రస్తుతానికి పోలిస్తే ప్రస్తుత బిల్లులు, కార్మిక, రవాణా ఛార్జీల్లో భారీ వ్యత్యాసం ఉందంటున్నారు. ఇవి మిల్లుల నిర్వహణలో అత్యంత కీలకమైనా.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు చెల్లించాల్సి మిల్లింగ్ ఛార్జీలు ప్రభుత్వం చెల్లించడంలో ఆలస్యం అవుతుండటంతో పరిశ్రమ మరింత అగాథంలోకి వెళ్తోందని వాపోతున్నారు. మరికొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నా.. నాలుగు సీజన్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం రైసుమిల్లర్లకు చెల్లించాల్సిన మిల్లింగ్ ఛార్జీలు రూ.4.50 కోట్లు బకాయి ఉండటం కూడా ఒక ప్రధాన కారణమని అంటున్నారు. అనేక రకాలైన కారణాలతో మిల్లుల పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీజిల్, విద్యుత్తు, ఇతర వస్తువుల ధరలు వంద రెట్లు పెరిగినా కస్టమ్‌మిల్లింగ్ చెల్లింపుల్లో ఎటువంటి మార్పు లేదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు గత నాలుగు సీజన్‌లుగా మిల్లర్లు సీఎంఆర్ బియ్యం ఎఫ్‌సీఐకి అందజేస్తున్నారు. మిల్లింగ్ ఛార్జీల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండంతో తీరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ సీజన్‌లో బియ్యం పెట్టేందుకు ప్రతి మిల్లరు సిద్ధంగా ఉన్నా.. ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ గోదాంలలో చోటు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్వింటా ధాన్యాన్ని బియ్యంగా మార్పిడి చేస్తే బియ్యం నాణ్యతను బట్టి నిర్దేశించిన కిలోలలో బియ్యం అందించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రజలు తినే రారైస్ బియ్యం అయితే క్వింటాకు 67 కిలోలు, బాయిల్డ్‌రైస్ (ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి) చేసేది 68 కిలోల చొప్పున మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. బియ్యంగా మార్చినందుకు మిల్లర్లకు క్వింటాకు ఇంత మొత్తం ప్రభుత్వం అందిస్తుంది. దీంతో పాటు తవుడు, నూకలు మిల్లర్‌కు మిగిలిపోనున్నాయి.