చంద్రబాబు వ్యూహం నేరవేరేనా
విజయవాడ,
రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఊరట లభించడం లేదు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీని రెండో సారి కూడా అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. వంగి వంగి దండాలు పెట్టారు. రెండో సారి గెలిపించడం మహాప్రభో అని వేడుకున్నారు. అయినా ప్రజలు మాత్రం వైసీపీకి పట్టం కట్టారు. అధికారం అనేది శాశ్వతం కాదు. సో.. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేదే. అయితే, దీనికి భిన్నంగా చంద్రబాబుకు ఒకపక్క అధికారం పోవడంతోపాటు.. పార్టీ కూడా కకావికలం అయిపోతోంది. దీంతో బాబుకు దిమ్మతిరిగి పోతోంది.సీనియర్లు, పార్టీని నడిపించాల్సిన యువ నాయకులు కూడా ఎక్కడా దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. అదేసమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే జరిగితే.. పార్టీ నిలబడడం కూడా కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు జిల్లాల పర్యటనను ప్రారంభించారు. జిల్లాల వారీగా ఓటమిపై సమీక్షలు నిర్వహించి, నేతల్లో మనోధైర్యం కలిగించడంతో పాటు పార్టీని లైన్‌లో పెట్టాలని ఆయన భావించారు.అయితే, సీనియర్లు మాత్రం కదలడం లేదు. దీంతో జిల్లాల్లో పరిస్థితి ఇప్పట్లో చక్కబెట్టడం సాధ్యమేనా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ లోతుపాతులు గుర్తించి, పార్టీని గాడిలో పెట్టాలని ఆయన భావించారు. గత 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమలో ఇప్పుడు గడ్డు పరిస్తితి ఎదురైంది. ఇక, నలుగురు ఎమ్మెల్యేలను తెచ్చుకున్నా.. ప్రస్తుతం విశాఖలోనూ ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది ఆయా జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయనకు సహకరించేందుకు సీనియర్లు ఎవరూ కూడా ఆయనకు సహకరించలేదు. పైగా పోలీసులపై కామెంట్లు చేసి, వివాదాస్పదం కావడంతో విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది. మరి పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు వ్యూహం నెరవేరేనా ? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? పార్టీకి ఫ్యూచర్ ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.