టెన్త్ పరీక్షల్లో మార్పులు
గుంటూరు,
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపుదిద్దింది. ఇందులో బిట్ పేపర్ రద్దు సహా అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు (జీఓ 69) జారీ చేశారు. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న పరీక్షల నుంచే ఈ నూతన విధానం అమలుకానుంది.
పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు.బిట్ పేపర్ వేరేగా ఉండదు. ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు. హిందీ, ఓఎస్సెస్సీ, కాంపోజిట్ తెలుగు తప్ప మిగిలిన అన్ని పరీక్షలకు సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం చదివేందుకు మరో 15 నిమిషాలు.
హిందీ పరీక్షకు 3 గంటలు, ఓఎస్సెస్సీ లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు.
సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ప్రశ్నపత్రం స్వరూపం ఇలా ఉంటుంది (50 మార్కులకు)
– ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 12 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 6 మార్కులు.
– 8 అతిలఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 8 మార్కులు.
– 8 లఘు ప్రశ్నలకు ఒకొక్క దానికి రెండేసి మార్కుల చొప్పున 16.
– 5 వ్యాస రూప (ఎస్సే) ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి.
–లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది.
–సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు.
–సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఇలా ఉండగా విద్యార్థుల పాస్ మార్కులపై ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సబ్జెక్టుల వారీగా కాకుండా పేపర్ వారీగా పాస్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దీని వల్ల విద్యార్థులు ఒక పేపర్లో ఎక్కువ మార్కులు సాధించినా రెండో పేపర్లో పాస్ మార్కులు రాకుంటే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పాస్ మార్కుల గురించి ప్రస్తావించలేదు. దీంతో పాత పద్ధతిలో సబ్జెక్టుల వారీగానే పాసు మార్కులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి.