తెలంగాణ వాసుల్లో జై జగన్ క్రేజ్
విజయవాడ,
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆయన అయిదు సంవత్సరాలు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. బలమైన త్రిముఖ పోటీ మధ్య రెండు రాష్ట్రాల జనం కోరి మరీ వైఎస్సారే మా సీఎం అని రెండవమారు గెలిపించున్నారు. అయితే వారి ఆశలు అడియాశలు చేస్తూ విధి వైఎస్సార్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయింది. ఆ తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడదామంటే నాటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అడ్డుకుంది. దానికి కారణం కూడా జగన్ కి తెలంగాణా జనంలో బలం అధికంగా ఉండడమే. ఇక షర్మిల పాదయాత్ర చేసినపుడు తెలంగాణా అంతటా హోరెత్తించి. జగన్ జైలు నుంచి బయటకు వస్తే హైదరాబాద్ జనసంద్రమే అయింది. ఇవన్నీ ఇలా ఉంటే 2014 ఎన్నికల్లో కూడా ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆ తరువాత జగన్ ఏపీ రాజకీయాల్లో పడి తెలంగాణాను పక్కన పెట్టేశారు.ఇక ఇపుడు జగన్ ఏపీకి సీఎం గా ఉన్నారు. నాలుగు నెలల పాలన ముగిసింది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను పొరుగురాష్ట్రం తెలంగాణా జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో జగన్ ని తలవని వర్గం లేదు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి జగన్ తెలంగాణాలో హీరో అయిపోయారు. ఆర్టీసీ కి మద్దతుగా నిలిచిన పార్టీలు కానీ ప్రజాసంఘాలు కానీ జగన్ గ్రేట్ అంటున్నారు. ఆయన్ని చూసి నేర్చుకోండి అంటూ వామపక్షాల నేతలు కేసీయార్ కి సుద్దులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ సాగుతోంది. జగన్ తెలంగాణాలో వైసీపీని విస్తరించండి, మీలాంటి డైనమిక్ లీడర్ మాకు కావాలంటూ యూత్ పెడుతున్న సందేశాలతో హోరెత్తిపోతోంది. జై జగన్ నినాదాలు ప్రవాస తెలంగాణావాసుల్లో కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.జగన్ సీఎం గా ఏపీలో అమలు చేస్తున్న ప్రతీ నిర్ణయాన్ని అసక్తిగా గమనిస్తున్న తెలంగాణా వర్గాలు జగన్ లాంటి సీఎం ఉంటే మాకు బాగుండు అనుకుంటున్నారట. ముఖ్యంగా యువత లక్షల్లో ఏపీలో ఉద్యోగాలు జగన్ ఇవ్వడంతో అయ్యో మేము ఇక్కడ పుట్టామేనని అంటున్నారుట. ఇక రైతుల కోసం జగన్ తీసుకుంటున్న పధకాలు, మహిళలు, విద్యార్ధులు, విద్య, వైద్యం వంటి వాటి విషయాల్లో జగన్ నిర్ణయాలను తెలంగాణా జనం వేణ్ణోళ్ల పొగుడుతున్నారుట.జగన్ 2021 లో జరిగే గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో మీ పార్టీని పోటీలో పెట్టాల్సిందేనని సందేశాలు పంపుతున్నారట. ఇక ఇవన్నీ చూసిన తెలంగాణా వైసీపీ నేతలు కూడ తమ అధినేతను తెలంగాణాలో పార్టీ యాక్టివిటీస్ పెంచాలని కోరుతున్నారుట. మరి జగన్ ఇంతటి మంచి అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటారా లేదా అన్నది చూడాలి. జగన్ ఇపుడు కేసీఆర్ కంటే బాగా నచ్చేస్తున్నాడు. అందువల్ల ఆయన అడుగులు కూడా తెలంగాణలో జాగ్రత్తగా వేయాలని కూడా అంటున్నారు. మరి జగన్ కనుక వైసీపీ జెండాను అక్కడ ఎగరేయాలని నిర్ణయిస్తే పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్లు సైతం సైరా జగన్ అంటూ ఆ పార్టీలోకి దూకేయడం ఖాయమంటున్నారు