ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నవంబరు 4వ తేదీకి పొడిగింపు
హైదరాబాద్,
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అక్టోబరు 29వ తేదీ వరకూ ఉన్న గడువును పొడిగించింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో విద్యార్దులకు ఇబ్బందులు కలగకూడదన్న భావనతోనే గడువును నవంబరు 4వ తేదీ వరకూ పొడిగించినట్టు బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ తెలిపారు. మార్చి, 2020 సంవత్సరానికి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ఫెయిల్ అయిన వారు, ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్దులకు ఈ వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల యాజమాన్యాలు దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.