జాతీయ ప్రదర్శనకు తొలిరోజే విశేష స్పందన
పుస్తక ప్రియులకు అచ్చమైన పర్వదినమిది.. ఎన్ని లక్షల పుస్తకాలని! భిన్న భాషలు.. అనువాదాలు.. వేర్వేరు సాహిత్య పక్రియలు.. సమకాలీన అంశాలపై సమాలోచనలు.. రచయితల పరిచయాలు.. సాంస్కృతిక వేడుకలు.. ఇలా ఎన్నెన్నో అంశాలతో పెద్దలు, పిల్లల్ని కట్టిపడేసే పండుగ వచ్చేసింది. గురువారం సాయంత్రం ‘31వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిరోజు నుంచే విశేష స్పందన లభించింది. సందర్శకులతో ఇక్కడి భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణం విజ్ఞానకళను సంతరించుకుంది.
మంచి సాహిత్య విలువలున్న పుస్తకాలను చదవడం వల్ల జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నది రచయితల మాట. అటువంటి సాహిత్యం కోసం వెతుక్కోవాల్సిన పనిలేకుండా ఒకేచోట లభ్యమయ్యేలా ఈ ప్రదర్శన ఉపకరిస్తోంది. కవిత్వం, నవలలు, కెరీర్, చరిత్ర, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఆధ్యాత్మికం, బాలసాహిత్యం, పోటీపరీక్షల పుస్తకాలు, కొంగొత్త సేద్య పద్ధతులు..సైన్స్ ప్రయోగాలు.. ఇలా అనేకం ప్రదర్శనలో కొలువుదీరాయి. హైదరాబాద్ ప్రచురణ సంస్థలతో పాటు విజయవాడ, నెల్లూరు, అనంతపురం, ముంబయి, న్యూదిల్లీ, జైపూర్ ప్రచురణకర్తలు తమ స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు.
సృజనాత్మకంగా..
పుస్తకాల్లో అక్షరాలు మాత్రమే కాకుండా తోలుబొమ్మలతో పిల్లల్లో చదవడంపై, సృజనాత్మకంగా ఆలోచించడంపై దృష్టిపెట్టారు జాన్ బుక్స్ నిర్వాహకులు. డాక్టర్ మధులిక సాగరం, స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ, ఆర్ట్ ఆండ్ క్రాఫ్ట్‌కు చెందిన పద్మిని రంగరాజన్ ఈ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రదర్శనలో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ‘పోయెట్రీ ఇన్ ద కిచెన్’ ‘పోయెట్రీ ఇన్ ద ఓషన్’ పేరుతో శుక్రవారం రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. త్వరలో తెలుగులోనూ ఈ తరహా పుస్తకాలను తీసుకురాబోతున్నట్లు మధులిక తెలిపారు.
క్విజ్‌లు.. ప్రయాణ అనుభవాలు
ప్రయాణ పుస్తకాలు ప్రదర్శనలో అనేకం కనిపించాయి. ఔత్సాహిక రచయితలు తమ అనుభవాలను, తిరిగిన ప్రాంతాల విశేషాల సమాహారంతో వీటిని ప్రచురిస్తున్నారు. పుస్తక ప్రియుల నుంచి వీటికి మంచి ఆదరణ ఉందని రచయితలు అంటున్నారు. జన విజ్ఞాన వేదిక విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలతో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు క్విజ్ పుస్తకాలు ప్రదర్శనలో ఏర్పాటయ్యాయి.
ఒకే పుస్తకం.. రెండువైపుల
పెద్ద పెద్ద పుస్తకాలు అనగానే తర్వాత చదువుదాం అనే విరామమిచ్చే రోజులివి. దీంతో రచయితలు పుస్తకాల పేజీలపైన దృష్టిపెట్టారు. చిన్న పుస్తకాలను వెలువరిస్తున్నారు. ఇందులోనూ ఇప్పుడు కొత్త పోకడలకు తెరతీశారు. ఒకే పుస్తకాన్ని రెండువైపుల తిరగేసి రెండు కథలను చదువుకోవచ్చు.