సౌకర్యాలెక్కడ..? (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, : జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల ఏడేళ్లుగా సమస్యల వలయంలోనే కొనసాగుతోంది. 2013లో ప్రారంభం అయినప్పటికీ నేటికి రిమ్స్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఆసుపత్రిలోని కొంత భాగంలోని గదులను కార్డ్‌బోర్డుతో వేరు చేసి కళాశాలను నిర్వహిస్తున్నారు. వసతి గృహం లేక కళాశాలకు స్వంత భవనం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటీవల రిమ్స్ ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థినులకు కొంత మేర వసతి గృహం సమస్య పరిష్కారం అయినా కళాశాల భవనం సమస్య మాత్రం తీరలేదు. నర్సింగ్ కళాశాల భవనం గత కొన్నేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అయింది. మూడేళ్ల కిందట రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపగా అవి దిక్కూ మొక్కు లేకుండా పోయాయి. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సందర్శన సందర్భంగా కళాశాల భవన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు రిమ్స్ ఎదురుగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వెనుక వైపు ఉన్న సిమాంగ్ భవనం పక్కన 1.29 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. భవన నిర్మాణానికి తాజాగా రూ.21 కోట్ల అంచనా వ్యయంతో మరోసారి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఆమోదం మాత్రం లభించలేదు. మంత్రి ఆదేశానుసారం ప్రత్యామ్నాయంగా విద్యార్థినులకు తాత్కాలికంగా వైద్య కళాశాల ఆవరణలోని వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న బాలికల వసతి గృహాన్ని కేటాయించారు. ఇందులో ముప్పై గదులుండగా దాదాపు 120 మంది విద్యార్థినులు ఉంటున్నారు. కొత్తగా ఈ ఏడాది చేరే విద్యార్థులు వస్తే మాత్రం ఈ వసతి గృహం కూడా వారికి సరిపోక మళ్లీ ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. అధికారులు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు. నర్సింగ్ విద్యార్థినులకు వైద్య కళాశాల ఆవరణలోని వసతి గృహాన్ని కేటాయించినప్పటికీ పారిశుద్ధ్యాన్ని విస్మరించారు. ముప్పై గదులున్న ఈ వసతి గృహాన్ని రోజువారీగా శుభ్రం చేయటానికి ఎలాంటి వ్యవస్థ లేదు. విద్యార్థినులే తలా కొంత వేసుకొని ప్రస్తుతం ఒక కార్మికురాలిని ఏర్పాటు చేసుకున్నారు. వసతి గృహం బయట చెత్త, పిచ్చిమొక్కలు పెరిగిపోతున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా రిమ్స్ ఆసుపత్రిలోని ఈ ఇరుకు గదుల్లోనే నర్సింగ్ కళాశాల కొనసాగుతోంది. 2013లో ప్రారంభమైన ఈ కళాశాలలో ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు నర్సింగ్ విద్య పూర్తి చేసుకున్నాయి. మూడో బ్యాచ్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి నర్సింగ్ విద్య పూర్తి చేసుకుంటుంది.