YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మన్యాని విద్యుత్ వెలుగులు (ఖమ్మం)

మన్యాని విద్యుత్ వెలుగులు (ఖమ్మం)

మన్యాని విద్యుత్ వెలుగులు (ఖమ్మం)
ఖమ్మం,: మన్యంలో ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని ఆవాసాలున్నాయి. వీటిని గుర్తించి నిబంధనల ప్రకారం కరెంటు సౌకర్యం అందించాలని  ప్రభుత్వం భావిస్తోంది. అటవీ చట్టాలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా పనులుండేలా కార్యాచరణ తయారు చేస్తున్నారు. త్రీఫేజ్‌ లేని వాటిని సర్వే చేసి అక్కడ తగు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇలాంటి పల్లెలు ఎన్ని ఉన్నాయనేది క్షేత్రస్థాయి పర్యటనలు చేసి లెక్కలు తేల్చనున్నారు. అడవి బిడ్డలు నివాసం ఉండే రెవెన్యూ గ్రామాలకు విద్యుత్తు లేదు అనే మాట వినపడకుండా చర్యలు చేపట్టారు. గిరిజనం ప్రధాన వృత్తి వ్యవసాయం. జిల్లాలో సుమారు 36 శాతం గిరిజనులు ఉండగా ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత రంగాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో సేద్యంపైనే మక్కువ చూపిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే సత్తా ఉన్నా మౌలిక సదుపాయాల కొరతతో దిగుబడి సాధనలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర విభజనకు ముందు ‘ఇందిర జలప్రభ’ పథకం అమల్లో ఉంది. ఆ తర్వాత ఈ పథకం పనులు ఆగిపోయాయి. జిల్లాలో ఎక్కడెక్కడ ఆగాయో నివేదికలను తెప్పించుకున్న ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ పనులను ‘గిరి వికాసం’ పేరిట చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి మోటార్లతోపాటు విద్యుత్తు లైన్లు లేని వాటిని లెక్కలు కట్టారు. జిల్లాలో ఇవి 267 యూనిట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటికి రూ.3.47 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బోర్లలో నీటి లభ్యతను అంచనా వేసినందున త్వరలోనే మిగిలిన పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గిరి వికాసం కోసం కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 3,084 మంది లబ్ధిదారులుగా ఉన్న 12,224 ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని అభ్యర్థించారు. ఇందులో బోరు, మోటారు, విద్యుత్తు సదుపాయం కల్పించనున్నారు. 10 ఎకరాలను ఒక యూనిట్‌గా నిర్ణయించారు. ఇందులో కనీసం ఇద్దరు రైతులు ప్రయోజనం పొందాలన్నది నిబంధన. లబ్ధిదారులకు ఉపాధి హామీ కార్డు ఉండాలి. ప్రతి యూనిట్‌కు రూ.1.6 లక్షలు కేటాయించారు. విద్యుత్తు లైన్లు దూరంగా ఉన్నా, బోరు లోతుగా దించాల్సి వచ్చినా ఈ ధరలో మార్పులు ఉండే వీలుంది. దరఖాస్తుదారుల భూములను సంబంధిత అధికారులు పరిశీలించి అక్కడ నీటి లభ్యత ఉందా? లేదా? అన్నది తేల్చనున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ మొదలయ్యే వీలుంది.
గిరి వికాసం కాకుండా ఇంకొన్ని పనులను ఐటీడీఏలోని విద్యుత్తు విభాగం చేపట్టింది. దాదాపు 4 వేల ఎకరాలకు సాగు యోగం కల్పించాలని సంకల్పించారు. 1,298 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా రూ.2.6 కోట్లు దీనికి కేటాయించారు. పొలాల్లో ట్రైకార్‌, భూగర్భ జల విభాగాల ద్వారా బోర్లు నిర్మించగా వాటికి మోటార్లతోపాటు విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు ఏపీవో స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 1,069 లబ్ధిదారులకు సంబంధించి రూ.1.76 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల అటవీ అభ్యంతరాలు తలెత్తడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పనులకు పూర్తిస్థాయిలో మోక్షం లభించేలా చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నది మన్యం వాసుల కోరిక. వ్యవసాయ శాఖ, విద్యుత్తు విభాగం, ఉపాధి పథకం, రెవెన్యూ, అటవీ విభాగాలు సమన్వయం కుదుర్చుకుంటే పనులు ప్రగతి బాట పట్టడం ఖాయం. పథకాల నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంటే గిరిజనులకు వివరించే వీలుంది.

Related Posts