నేడు *గోవర్ధనగిరి పూజ*
శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు. సమస్త జీవరాశుల సంరక్షకుడు. ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికీ ఆయన రక్షణ ఉంటుంది. అయితే అన్యదా శరణం నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, చేసిన శపథాలను పక్కన పెట్టయినా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను ఎలా కాపాడుకోగలడో తెలియజెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు. ఆ ఫలితంగా గోవర్ధనగిరిగా అవతరించాడు. భగవానుడి పాదస్పర్శతో పునీతమైన పర్వతమిది. గోకులకృష్ణుడి లీలలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గొప్ప స్థలమిది. తన యజ్ఞానికి తెచ్చిన హవనాది సామగ్రిని శ్రీకృష్ణుని సూచనతో గోవర్ధనగిరి పూజకు మళ్లించడంతో బృందావనవాసులపై ఆగ్రహించాడు దేవేంద్రుడు. ఇక్కడ ప్రకృతిలోని ఒక నిర్జీవమైన శిలను పూజించమని శ్రీకృష్ణుడు చెప్పడంలేదు. ఈ పర్వతం సాక్షాత్తు తన స్వరూపమేనని చెప్పాడు. అయినా దేవేంద్రుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఏడు రోజుల పాటు వర్ష ధారలను కురిపించాడు. ఆ ఉపద్రవం నుంచి గోకులాన్ని కాపాడేందుకు చిన్ని కృష్ణుడు పూనుకున్నాడు. ఒక చిన్న పుట్టగొడుగును ఎత్తినట్టు తన ఎడమచేతి చిటికెన వేలితో అవలీలగా పర్వతాన్నే ఎత్తి పట్టి తన భక్తులను సంరక్షించాడు. అసామాన్యమైన ఈ ఘట్టం గోకులవాసుల భక్తిని, పరమాత్ముడి అనంత శక్తిని చాటింది. విశుద్ధ భక్తితో భగవత్ ప్రేమను, సంరక్షణను పొందవచ్చని నిరూపించింది.