ఒంటికాలుపై లేచేవారు పోగడ్తలతో ముంచెత్తుస్తున్నారు...
విజయవాడ,
తన తండ్రికి మంచి పేరు తెస్తానని పదే పదే జగన్ అంటారు. అలా రాజకీయ ప్రత్యర్ధుల నోటి నుంచి కూడా వైఎస్సార్ గ్రేట్ అన్న మాట వచ్చేలా చేస్తోంది మాత్రం కచ్చితంగా జగనే. జగన్ అయిదు నెలల పాలనలో ఎక్కువసార్లు చంద్రబాబు వైఎస్సార్ ని తలచుకుంటున్నారు. తనయుడు కంటే తండ్రి చాలా మంచి వారు, ఉత్తమ పరిపాలకుడు అంటూ కితాబు ఇస్తున్నారంటే అది నిజంగా జగన్ ఘనతేనని చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా ఆ మధ్యన వైఎస్ తనకు మంచి మిత్రుడు, గొప్ప నాయకుడు అంటూ కితాబు ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత కూడా తరచుగా వైఎస్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. వైఎస్సార్ పాలనపై ఇటీవల విశాఖ టీడీపీ సమీక్షా సమావేశంలోనూ తలచుకున్న చంద్రబాబు తాను ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఏదైనా విషయం చెబితే శ్రధ్ధగా వినేవారని గుర్తుచేసుకున్నారు.ఇక తాజాగా మరోమారు వైఎస్సార్ గురించి చంద్రబాబు పాజిటివ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తప్పు చేసినా తమలాంటి వారు చెబితే వెనక్కు తగ్గేవారని అంటున్నారు. తాను మాట్లాడిన ప్రతీ దాన్ని ఆయన అర్ధం చేసుకుని తప్పొప్పులు బేరీజు వేసుకునేవారని కూడా చెప్పారు. వైఎస్సార్ పాలనలో అనుభవం కనిపించేదని కూడా ఆయన చెబుతున్నారు. ఇపుడు చూస్తే జగన్ తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా పాలన చేస్తున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు. తప్పు అని చెప్పినా కూడా వినని జగమొండి జగన్ అని చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. వైఎస్ చాలా నయం అనేలా జగన్ పాలన సాగుతోందని కూడా గొప్ప పోలిక తీసుకువస్తున్నారు.జగన్ సీఎం అయ్యాక తండ్రిని తలచుకోవడంలో అర్ధం ఉంది. చంద్రబాబు ఎందుకు వైఎస్సార్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటున్నారన్నదే ఇపుడు పాయింట్. దీనికి కూడా లాజిక్ ఉందని అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు, వైఎస్సార్ ఒకే స్కూల్ నుంచి వచ్చిన వారు. ఇద్దరూ దాదాపుగా ఒకే వయసువారు. ఇద్దరూ కూడా మొదట్లో కలసితిరిగారు. ఆ సాన్నిహిత్యంతో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు మీద పెద్దగా రాజకీయ వత్తిడి ఉండేది కాదంటారు. రాజకీయంగా విభేదాలు ఎన్ని ఉన్నా అవి హద్దులు దాటలేదని కూడా ఇద్దరినీ జాగ్రత్తగా గమనించిన వారు చెబుతారు. అదే జగన్ విషయానికి వస్తే తరాల అంతరం పెద్ద అడ్డంకిగా ఉంది.ఇక, జగన్ ని సీఎం గా చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు. జగన్ సైతం చంద్రబాబుని వ్యక్తిగత శత్రువుగా చూస్తున్నారు. అలాంటి అనుభవాలు బాధలు జగన్ కి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నాయి. చంద్రబాబు రాజకీయ కుట్రలను నిజంగా ఎదుర్కొన్నది జగన్ కావడంతో ఇపుడు ఆయన దూకుడుగా ఉంటున్నారు. దాంతో చంద్రబాబుకు జగన్ కంటే వైఎస్ నయం అని పదే పదే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ అంటే ఒంటికాలు పై లేచే చంద్రబాబు ఇపుడు వైఎస్ గ్రేట్ అంటున్నారంటే వైఎస్సార్ వారసునిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఘన విజయం సాధించేసినట్లే.