కిడ్నీ పేషంట్లకు చుక్కలు
నల్గొండ,
రాష్ట్రంలో కిడ్నీ పేషంట్లు పెరిగి పోతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసీస్ వరకు వెళ్లేవారు ఇటీవల ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 25 వేలమంది వరకు ఉన్నఈ తరహా పేషంట్లు, వారంలో మూడురోజుల పాటు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. వీరిలో అత్యధికమంది పేద, మధ్యతరగతి వారే ఉన్నందున ప్రభుత్వం వారికే డయాలసీస్ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద చేయిస్తోంది.కిడ్నీ పేషంట్లకు చుక్కలు కన్పిస్తున్నాయి. డయాలసీస్ పేషంట్లకు అత్యవసరమైన ఫిస్టులా ప్రొసీజర్ ప్రభుత్వ హాస్పటల్స్ లో ఎక్కడా లేకపోవడం రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీపేషంట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల డయాలసీస్ సెంటర్స్ పెట్టినా.. ఫిస్టులా ఆపరేషన్ కోసం మాత్రం నిమ్స్ వరకు రావాల్సి వస్తోంది.కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ అనేది సాధారణంగా మెడ, తొడ నుంచి ప్రత్యేక పైపులు పెట్టి రక్తం శుద్ధి చేస్తారు. కానీ.. చేతికి ఫిస్టులా ఆపరేషన్ చేయించుకొంటే డయాలసీస్ అవసరమైనంత కాలం.. ఆచేతి మార్గం నుంచి పైప్ ద్వారా రక్తం శుద్ధి చేసేందుకు వీలౌతుంది. నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ కి పెద్దఎత్తున ఫిస్టులా చేయించుకునేందుకే డయాలసిస్ పేషంట్లు వస్తున్నా.. ఒక్కలిద్దరికే అవకాశం వస్తుంది. మిగతా ప్రభుత్వ హాస్పటల్స్ లో ఫిస్టులా ఆపరేషన్ చేయకపోవడంతో నిమ్స్ పై పేషంట్ల ఒత్తిడి పెరిగింది.ఉస్మానియా, గాంధీ, ఎంజిమ్ లాంటి టీచింగ్ హాస్పటల్స్ లో కూడా ఫిస్టులా ప్రొసీజర్ చేసేందుకు అవకాశమున్నా డాక్టర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒక్కసారి డయాలసీస్ పేషంట్ గా డిక్లేర్ అయితే పర్మినెంట్ ప్రొసీజర్ కోసం చేయి మణికట్టు దగ్గర లేదా మోచేయి నరాన్నిగుర్తించి డాక్టర్లు ఫిస్టులాను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రొసీజర్ ప్రభుత్వ పరిధిలో ఎక్కడా చేయకపోవడంతో రోజూ 40 మంది డయాలసీస్ పేషంట్లు నిమ్స్ హాస్పిటల్ కు వస్తున్నారు. కనీసం మరో పదిచోట్ల ఫిస్టులా ఆపరేషన్ చేసేలా చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ప్రైవేట్ గా ఫిస్టులా చేయించుకునేందుకు 25వేలు ఖర్చు అవుతుంది. దాంతో.. అంత భారాన్ని భరించలేని పేషెంట్లు.. నెలలతరబడి నరకం అనుభవించలేక నిమ్స్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ అవసరమని డాక్టర్లు సూచిస్తే, ముందుగా ఫిస్టులా చేయించుకోవడంతో డయాలసీస్ టైంలో కష్టం కాదంటున్నారు. ఇటీవల కిడ్నీ పేషంట్లుగా వస్తున్నవారిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే డిసీజ్ ముదిరిపోతోందంటున్నాడాక్టర్లు.