YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అత్యాశ ఫలితం (కృష్ణా)

అత్యాశ ఫలితం (కృష్ణా)

అత్యాశ ఫలితం (కృష్ణా)
కైకలూరు,: నిత్యం నిండుగా జలంతో ప్రవహించే ఈ ఏరు చుట్టూ ఆపదలు ముసురుకుంటున్నాయి. కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏటికి ఆనుకొని ఉన్న ఎన్నో గ్రామాల్లోని మత్సకార కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. అలాంటి జలసిరిపై అక్రమార్కుల కన్నుపడింది. కొందరు వ్యక్తుల స్వలాభానికి మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తీరవాసులకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.కొల్లేరుకు, సముద్రానికి అనుసంధానంగా ఉన్న ఉప్పుటేరు కైకలూరు మండలం కొట్టాడ నుంచి మొదలై కలిదిండి మండలం మీదుగా ప్రవహిస్తోంది. రోజూ కొల్లేరు నుంచి సుమారు 10 నుంచి 15 క్యూసెక్కుల నీటిని సముద్రానికి తీసుకువెళ్లే ఈ ఏరు కృత్తివెన్ను మండలంలోని లక్ష్మీపురం, పల్లెపాలెం వద్ద రెండు పాయలుగా విడిపోయింది. ఇందులో ఒక పాయ పడతడిక వద్ద, మరో పాయ పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళీపట్నం మీదుగా వెళ్లి దిబ్బలపాలెం వద్ద సముద్రంలో కలుస్తాయి. ఉప్పుటేరుకు ఆనుకుని చాలాకాలం కిందట చిన్న చిన్న మడులుగా ఏర్పాటు చేసుకుని ఆక్వా సాగు చేయడం మొదలైంది. ఇది క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఒకరు తవ్వారని ఇంకొకరు.. వారిని చూసి మరొకరు.. ఇలా ఏటి గట్టు ఆక్రమణలకు గురవుతోంది. బతుకుదెరువు కోసం అంటూ పదేసి సెంట్లలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారూ ఉన్నారు. వారి మాటున పదుల సంఖ్యలో ఎకరాలను ఏకం చేసి ఏలుతున్నవారూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో పరిశీలిస్తే.. కైకలూరు, కలిదిండి మండలాల్లో ఆక్రమణల కారణంగా ఏటి గట్టు చాలా బలహీనపడింది. కొన్ని చోట్ల ఏకంగా ఉప్పుటేరు నుంచి నేరుగా చేపల చెరువులకు గండి కొట్టేశారు. ఉప్పుటేరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది. శాఖల మధ్యల సమన్వయం లోపించడం మరో కారణం. ఫిర్యాదులు వచ్చినప్పుడు తాత్కాలికంగా అడ్డుకోవడం.. ఆ తరువాత జరిగే తంతును కళ్లప్పగించి చూడడం పరిపాటిగా మారింది. ఆక్రమణల జోలికి పోవడానికి అధికారులకు ధైర్యం సరిపోవడం లేదు. అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం ఎక్కడి నుంచి.. ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితిలో ఎవరికివారు తమ కాలం ముగిసే వరకు గడిపేసి.. తరువాత బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో ఏటి పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు నీటి ఎద్దడిని నివారించే దిశగా ఉప్పుటేరుపై ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులో భాగంగానే ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ను నిర్మించాలన్న ఆలోచన చేస్తోంది. దాంతో పాటు ఏటి గట్లను పటిష్ఠం చేసే దిశగా గట్టి చర్యలు చేపట్టాల్సిఉంది. గట్లు నానాటికీ క్షీణించిపోవడంతో తీరవాసులు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఓ మోస్తరు వర్షాలకే ఏరు ఎగదన్నుతోంది. దివిసీమ ఉప్పెన సమయంలో ఈ ఏరు ప్రభావంతో సమీప ప్రాంతాలు మునిగిపోతాయనే ఉద్ధేశంతో తుపాను రక్షిత భవనాలను నిర్మించారు. ఆనాడే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. రాన్రాను అసలు భద్రతపై అశ్రద్ధ వహించారు. ఫలితంగా ఆక్రమణల పర్వం మొదలైంది. ఇది పెను ప్రమాదానికి దారి తీయకముందే ప్రత్యామ్నాయం దిశగా ఆలోచన చేయాలి. ఏటి పరిరక్షణ, తీర వాసుల సంరక్షణకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

Related Posts