YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

జ్వరమొస్తే మరణమే.. (పశ్చిమగోదావరి)

జ్వరమొస్తే మరణమే.. (పశ్చిమగోదావరి)

జ్వరమొస్తే మరణమే.. (పశ్చిమగోదావరి)
ఏలూరు, : మన్యాని జ్వరమహమ్మారి పట్టిపీడిస్తోంది. కుక్కునూరు మండలంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతులు, జ్వర బాధితులు చికిత్స పొందిన ఆసుపత్రులు ఇచ్చిన వైద్యనివేదికలు డెంగీగా చూపుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఆ నివేదికలన్నీ తప్పు అంటున్నాయి. ఇటీవల మరణించిన మాచర్ల మనోజ్‌ డెంగీ జ్వరంతో బాధపడినట్లు ప్రైవేటు వైద్య నివేదికలు ఉన్నాయి. కానీ.. డెంగీలో కామెర్లు రావడానికి ఆస్కారం లేదని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ పేరుతో రోగులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కుక్కునూరులో జ్వరాలు ఈ స్థాయిలో ప్రబలడం వెనుక గల కారణాలు ఏమిటన్న దానిపై అధ్యయనం చేసేందుకు వైద్యులు సమాయత్తం అవుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్య నివేదికలు, మరణాలకు గల కారణాలను విశ్లేషించి నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. పూర్వపు ఖమ్మం జిల్లాలో ఉన్న విలీన మండలాలు పశ్చిమలోకి విలీనమైన తర్వాత ఈ స్థాయిలో జ్వరాలు ప్రబలడం ఇదే మొదటిసారి. ఏటా జ్వరాలు రావడం సహజమే అయినా ఇంతగా రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇతర ఏజెన్సీ మండలాలతో పోలిస్తే అక్కడ దోమలకు, ఇక్కడ దోమలకు తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దోమల నిర్మూలనకు ఎక్కువగా మలాథియాన్‌ పిచికారీ చేస్తుంటారు. విలీన మండలాల్లో ఉన్న దోమలు మలాథియాన్‌ మందుతో చనిపోవడం లేదు. దీంతో ఇక్కడ ఏసీఎం అనే ఎక్కువ మోతాదు గల మందును ప్రత్యేకంగా వాడాల్సి వస్తోంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఇంకా ఏమైనా ఉన్నాయా? జ్వరాలను నియంత్రించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై వైద్యశాఖ అధ్యయనం చేపట్టనుంది. విలీన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప పెద్దాసుపత్రులు లేవు. దీంతో రోగులు తొలుత ఆర్‌ఎంపీలు, ఆ తర్వాత భద్రాచలంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ తగ్గకపోతే విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ లోగా.. అసలు వ్యాధి ఏమిటన్నది కచ్చితంగా తేలక కొంతమంది చనిపోతున్నారు. ప్రైవేటు వైద్యులు మాత్రం జ్వర కేసుల్లో ఎక్కువగా డెంగీగా నిర్ధరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యులు మాత్రం డెంగీ కాదంటున్నారు. జ్వర బాధితులు ఎక్కువగా ప్రైవేటు వైద్యశాలలకే వెళ్తుండటంతో వ్యాధి నిర్ధరణ కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైద్య ఆరోగ్య అధికారులు ఉన్నారు. దీని వల్ల రోగులు ఈ ఆసుపత్రికి వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

Related Posts