YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గిరిపుత్రులపై నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

గిరిపుత్రులపై నిర్లక్ష్యం (ఆదిలాబాద్)

గిరిపుత్రులపై నిర్లక్ష్యం (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, : అడవిబిడ్డలకు నెలవైన జిల్లాల్లో వారే నిర్లక్ష్యానికి గురవుతున్నారు.  గిరిపుత్రుల పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన పాలకవర్గ సమావేశాలపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు ఉట్నూరు ఐటీడీఏ పాలక మండలి సమావేశాల నిర్వహణ తీరే నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికీ మూడేళ్లవుతున్నా సమావేశాలు నిర్వహించడం లేదు. నిధుల మంజూరులో జాప్యం, అధికారులు, ఉద్యోగ, సిబ్బంది భర్తీలో నిర్లక్ష్యం వెరసి వనవాసీల అభివృద్ధి గాడితప్పుతోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ఉట్నూరు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు అభాసుపాలవుతున్నాయి. ముందస్తుగా తేదీలను ఖరారు చేయడం ఆ తరువాత జిల్లా మంత్రి లేదా ఇతరత్రా కారణాలతో వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఇలా ఒకటి రెండు కాదు నాలుగుసార్లు వాయిదా వేశారు. చివరిసారిగా ఉమ్మడి జిల్లాలో 31.07.2016న ఐటీడీఏ పాలకవర్గ సమావేం నిర్వహించారు. ఆ తరువాత ఈనెలలో వచ్చేనెలలో అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు తప్పా సమావేశాలు నిర్వహించలేదు. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమం కొండెక్కుతోంది.
మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో చివరిసారిగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించిన అధికార యంత్రాంగం జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక.. ఒక్కసారి కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహణకు నోచుకోకపోవడం గమన్హారం. అడవి బిడ్డలు ఎదుర్కొంటున్న వెతలు, నిధుల విడుదలలో జాప్యం, ఉద్యోగ, సిబ్బంది ఖాళీలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అవినీతి, అక్రమాలపై చర్చించి చర్యలు చేపట్టేందుకు వేదికగా నిలిచే పాలకవర్గ సమావేశాల ఊసేలేదు. అయినా జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు దీనిపై దృష్టిపెట్టడం లేదని గిరిజనులు వాపోతున్నారు. నిర్వహించేలా చూడాల్సిన ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు వారి బాధ్యతను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఇప్పటికీ రెండు సార్లు ఇంటింటా జ్వరాల నిర్ధారణ(ఆర్‌ఎఫ్‌ఎస్‌)సర్వేను నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో అతిసారం, టైఫాయిడ్‌, మలేరియా వ్యాధులు ప్రబలి గిరిజనులకు తీవ్ర వెతలకు గురవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. చాలా మంది అనారోగ్యానికిగురై ఆసుపత్రుల్లో చేరారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. జిల్లాలో గిరిజనులకు వైద్యసేవలు అందించాలని గతంలో 11 మంది వైద్యనిపుణుల నియామకాలు చేశారు. వారు విధుల్లో చేరకపోవడంతో నియామకాలు రద్దు చేశారు. ఆ తరువాత మరోసారి నియామకాలు చేయకపోవడం లేదు. ఉట్నూరు, ఆసిఫాబాద్‌ వంటి ప్రధాన ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో వైద్యనిపుణులు లేక గిరిజన మహిళలు, చిన్నపిల్లలకు సరైన వైద్యం అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు మొరాయించడంతో సిబ్బంది సేవల్లో నిబద్ధత కొరవడింది. పీహెచ్‌సీలలో సరిపడ వైద్యసిబ్బంది లేక మొక్కుబడిగా వైద్యం అందిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. వైద్యసేవలను మెరుగుపర్చి ప్రాణాలను కాపాడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలలో గిరిజన సంక్షేమశాఖల ఆద్వర్యంలో నడిపిస్తున్న గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడుతోంది. అధికారుల కొరత, డిప్యూటేషన్ల వ్యవస్థతో నాణ్యమైన విద్య అందడం లేదని గిరిజన విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. సరైనరీతిలో ఆహారపట్టిక అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ విద్యాధికారి పోస్టును రద్దు చేయడం, ఉపాధ్యాయ, ఉద్యోగుల ఖాళీలతో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలపై పర్యవేక్షణ కరవైంది. చిన్నారులకు అందించాల్సిన విద్యాబోధన అటకెక్కింది. ఐటీడీఏ ఇంజినీరింగ్‌శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలలో రూ.50 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన బీటీ రహదారుల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు సృష్టిస్తోంది. రిజర్వు ఫారెస్ట్‌ పేరుతో వాగులపై నిర్మిస్తున్న వంతెనల పనులపై అభ్యంతరం చెప్పడంతో పనులు నిలిచిపోయాయి. రహదారుల నిర్మాణం అసంపూర్తిగానే ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా రహదారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కావాల్సిన అధికారులు, ఉద్యోగ సిబ్బంది లేక పాలన కుంటుపడుతోంది. ఐటీడీఏలో అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపి మొత్తం 107 పోస్టులు ఉండగా 37 రెగ్యులర్‌ అధికారులు ఉన్నారు. మిగతా 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యశాఖలో వైద్యులు, సిబ్బంది కలిపి 173 పోస్టులు ఖాళీగాఉన్నాయి. గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో 695 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీలోని 200 గిరిజన గ్రామాలకు శుద్ధజలం అందించేందుకు కెరమెరి మండలం ధనోరా వద్ద 2009 సంవత్సరంలో రూ.78 కోట్లతో నిర్మించిన శుద్ధజల పథకం(ఫిల్టర్‌బెడ్‌) అలంకారప్రాయంగా మారింది. మిషన్‌ భగీరథతో ఈ పథకాన్ని అనుసంధానం చేసినప్పటికీ ఇప్పటికీ యాభై శాతం గిరిజన గ్రామాలకు కూడా శుద్ధజలం అందించలేకపోతోంది. మరోవైపు కలుషిత నీరుతాగి గిరిజనులు వ్యాధుల బారినపడుతున్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.

Related Posts