YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతన్నల ఆశలు ఆవిరి (కర్నూలు)

రైతన్నల ఆశలు ఆవిరి (కర్నూలు)

రైతన్నల ఆశలు ఆవిరి (కర్నూలు)
కర్నూలు,: ఓర్వకల్లు మండలాన్ని గత ప్రభుత్వం పారిశ్రామిక హబ్‌గా ప్రకటించి వేలాది ఎకరాలు సేకరించింది.పరిశ్రమలు వస్తే తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనుకున్న రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పరిశ్రమలు రాలేదు. పరిహారం అందలేదు. మరోవైపు తమకున్న హక్కు చేజారిపోయింది. ఈ నేపథ్యంలో ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్ల క్రితం మండలంలోని 13 గ్రామాల్లోని 13,307.39 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం వస్తుందని భావించారు. కానీ, నాటి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు రాకపోవడం, పరిహారం ఇవ్వకపోవడంతో కర్షకులకు నిరాశే ఎదురైంది.
బాధిత రైతులు అప్పటి నుంచి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి మూడెకరాల వరకు పట్టాలు పొంది సమీప బ్యాంకుల్లో పంట రుణాలు, రాయితీ విత్తనాలు, ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఆరు నెలల క్రితం బాధిత రైతుల భూములను ఆన్‌లైన్‌లో తొలగించి ఏపీఐఐసీ పేరుమీదుగా మార్పు చేశారు. అప్పటి నుంచి కర్షకులు ఎలాంటి పథకాలు పొందలేకపోతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములు ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో తమ పేర్లు తొలగించటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన సాగుదారులు రుణాలు చెల్లించి తిరిగి కొత్తవి తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాయితీ విత్తనాలు, రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు. తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లేదంటే పరిహారమైనా ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు మాత్రం అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు కానీ సమస్యను పరిష్కరించటంలేదని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూములను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని, లేదంటే ఆన్‌లైన్‌లో ఎక్కించి న్యాయం చేయాలని కోరుతున్నారు. మండలంలోని 13 గ్రామాల్లో 13,307 ఎకరాలు సేకరించగా అందులో పట్టాలు పొంది సాగులో ఉన్న భూములు 1426.14 ఎకరాలు, పట్టాలు పొంది సాగులో లేని భూములు 1099.84 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ బంజరు భూములు 10921.45 ఎకరాలు ఉండగా పట్టా భూములు 959.80 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను ఏపీఐఐసీకి కేటాయించారు.

Related Posts