కొండోక్కిన కోడి
అనంతపురం,
కేజీ చికెన్ ధరలు అమాంతం పెరగడంతో ఆ సరదాలు, సంతోషాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మూడు నెలల్లో కేజీ రూ.110 నుంచి రూ.200లకు చేరుకుంది. దీంతో ప్రతివారం చికెన్ తెచ్చుకునేవారు మధ్యమధ్యలో మానేస్తున్నారు. మరికొందరు కేజీ తెచ్చుకునేకాడ అరకేజీ తెచ్చుకుని సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయంగా చేపలు తెచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో 300కు పైగా చికెన్« దుకాణాలున్నాయి. సగటున ఒక్కో దుకాణంలో రోజూ వంద నుంచి 500 కేజీల వరకు చికెన్ విక్రయించేవారు. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికితోడు రవాణా ఖర్చులు, దాణా, కోళ్లఫారం నిర్వహణ వ్యయం పెరుగుతూ వస్తోంది. ఫలితంగా కోళ్ల పెంపకం చేపట్టిన బడా కంపెనీలు నష్టపోయాయి. ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో ఆ నష్టాలను పూడ్చుకునేందుకు వారంతా సిండికేట్‌గా ఏర్పడి కోళ్ల ధరలను పెంచేస్తున్నారని, అందుకుగానూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రంగంలోకి కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేయడం చిన్నచిన్న కోళ్లఫారాలు నిర్వహించడం కష్టమైపోయింది. దీంతో బడా కంపెనీలు నిర్ణయించినదే రేటుగా మారింది. ఈ నెల మొదటివారంలో కేజీ రూ.130లుగా ఉండే చికెన్ ధర ప్రస్తుతం కొండెక్కి రూ.200లకు చేరుకోవడంతో పేదప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులు సరసమైన ధరలకు లభించే చికెన్‌పై ఎక్కువ మక్కువ చూపేవారు. కానీ ఇప్పుడు అది కూడా అందుబాటు ధరల్లో లభించడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కోళ్లఫారం నిర్వాహకులకు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారానైనా ధరలను నియంత్రించాలని మాంసాహార ప్రియులు కోరుతున్నారు.