YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

ఈ రోజునుండి శివమహా పురాణం ప్రారంభం

ఈ రోజునుండి శివమహా పురాణం ప్రారంభం

ఈ రోజునుండి శివమహా పురాణం ప్రారంభం
శ్రీ శివ మహా పురాణం 
శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.
శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.
అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదే ‘శివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?
అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు.
మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు ‘సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు’ అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.
అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.
అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది.
మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.
త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -
నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ
నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ
నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)
అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -
'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'
'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.
నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ *సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!*
*అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!*
ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.
ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!
అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.
*గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!*
*గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!*
అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

Related Posts