తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆదిమూలమైనవాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము!!
ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు!!
అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము!!
నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
ఆతడే బ్రహ్మణ్య దైవము!!
భావము:
బ్రహ్మణ్యదైవము అంటే పరబ్రహ్మ స్వరూపుడైన దైవమని అర్థము. అన్నమయ్య ఈ కీర్తనలో ఆ శ్రీవేంకటేశ్వరుడే పరబ్రహ్మ స్వరూపుడు, మూలకారణములకెల్లా "ఆది" అయినవాడు అని కీర్తించాడు. ఆతనికి విముఖులైనవారు, కొలుచుట మానినవారు అందరూ అవిధిపూర్వకము అయినవారే ( కర్తవ్య విముఖులే ). అంతెందుకు, ప్రపంచంలో పుట్టిన జీవులను ఎవ్వరి పేరుతో పిలుస్తున్నాము? మాసము, నక్షత్రములను అనుసరించి పేర్లను నిర్ణయిస్తాము కదా! మరి అవి ఎవరి పేర్లనుకున్నారు? సంకల్పము చెప్పుకోవాలంటే "ఓం కేశవాయ స్వాహా.." అంటూ నామాలు చదివి ఆచమనం చేస్తామే.. అవి ఎవరి పేర్లు? ఏ దేవునికి జీవితాంతం సేవ చేసినా, చివరికి నారాయణ నామమే గతి అవుతుంది. అంతిమయాత్రలో "నారాయణ" అని తీరాలి. సన్యాసికైనా నామోచ్చారణే గతి. పితృదేవతలకు ఏది అర్పించాలన్నా మొదట సంకల్పములో ఎవ్వరిపేరు స్మరిస్తామో ఆలోచించండి. నారదమహర్షి సదా ఊతపదంగా పలికేది "నారాయణ" నామమే. పార్వతీదేవి సదా జపించేది శ్రీహరి నామమే. ఆయన గాథలనే ఆమె వింటుంది. బ్రహ్మ, పరమేశ్వరుడు జపించే తారకనామము ఎవ్వరిది? అవన్నీ అటుంచండి. నేటి కలియుగంలో కలిదోషహరణ గావించి, కోరిన వరములు పొందాలంటే ఎవ్వరి నామము గతి అవుతున్నది? నారాయణుని కలియుగ రూపమైన శ్రీవేంకటేశ్వరునీదే.
(పితాళ్లకు - పితృదేవతలకు
నుడిగేటి - చెప్పుకొనునది)