వైసీపీలో సర్వే ముచ్చట్లు...
విజయవాడ, అక్టోబర్ 30,
జగన్ అధికారం చేపట్టి అయిదు నెలలు అయిన సందర్భంగా తాజాగా రూరల్ ఇండియా టీం పేరిట ఓ సంస్థ చేసిన సర్వే ఇపుడు ఏపీ అంతటా చక్కర్లు కొడుతోంది. ఈ సర్వేలో జగన్ కి ముఖ్యమంత్రిగా 70 శాతం మంది మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ముప్పయి శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ సర్వే ఫలితాలను చూసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మా నేతకు పాలన తెలియదు అన్నారు. ఆరు నెలలు తిరగకుండానే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. మెజారిటీ ప్రజలు జగన్ సర్కార్ భేష్ అంటున్నారు అని తెగ మురిసిపోతున్నారు. ఇపుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లా జగన్ నూటికి నూరు శాతం మద్దతు పొందుతాడని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వే ఫలితాలు ఎప్పటికపుడు మారుతాయన్న సంగతి ఫ్యాన్ పార్టీ నాయకులు గుర్తించాలని విపక్ష టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.జగన్ సర్కార్ బాగుందని అన్నవారంతా సంక్షేమ పధకాలను చూసి ఆకట్టుకున్నవారే. ప్రధానంగా లబ్దిదారులే. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందని వర్గాలు ఉన్నాయి.అలాగే తటస్థ ప్రజానీకం, చదువుకున్న వారు, మేధావులు ఉన్నారు. వారంతా ప్రభుత్వం తీరుని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరో వైపు ఇసుక కొరత అన్నది సర్కార్ కి పెను సమస్యగా మారుతోంది. కొత్త పాలసీ అంటూ జగన్ సర్కార్ మూడు నెలల కాలం వృధా చేసింది. పాత పాలసీని రద్దు చేసింది. ఈలోగా వరదలు ముంచుకువచ్చాయి. దాంతో ఇసుక సమస్య మరింత జఠిలం అయింది. ఇక ఇపుడు ఆన్ లైన్ మాఫియా కూడా తయారైపోయిందని అంటున్నారు. దీంతో జగన్ సర్కార్ ఎదుట ఇసుక అతి పెద్ద భూతమై నిలబడి సవాల్ చేస్తోంది. దానికి తోడు గ్రామాల్లో కరెంట్ కొరతలు ఉన్నాయి. అవి వేళా పాళా లేకుండా చికాకు పెడుతున్నాయి. పల్లెటూళ్ళో అయితే వానాకాలంలో ఈ కోతలేంటి అని జనం నిలదీస్తున్నారు. ఈ రెండు సమస్యలతో పాటు మిగిలినవి కొన్ని ఉన్నా కూడా ఇవి చాలు జగన్ సర్కార్ పరువు తీయడానికి అంటున్నారు. సర్వేలో ఇవే విషయన్ని ప్రస్తావిస్తూ చాలా మంది ప్రజలు జగన్ సర్కార్ తీరు మార్చుకోవాలంటూ కోరడం విశేషం.అయిదు నెలల కాలంలో డెబ్బై శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారంటే రానున్న కాలంలో ఆ గ్రాఫ్ మరింత తగ్గుతుందే తప్ప పెరగదు అని తలపండిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పదమూడు జిల్లాలు అంతా ఒక్కటిగా జగన్ మా ముఖ్యమంత్రి అని గెలిపించారు. మరి ఫలితాలు నూరు శాతం ఉంటే ప్రజల సంతృప్తి డెబ్బై శాతానికే పరిమితం కావడం అంటే జగన్ ఆలోచించుకోవాలని సూచించే వారే ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇక ఒక్కొసారి చిన్న సమస్యలుగా కనిపించినవి కూడా పెను భూతాలై పార్టీ పరువు, ఉసురు తీస్తాయి. ఇపుడు జగన్ ఏలుబడిలో ఇసుక సమస్య అలాగే ఉంది. దీనికి ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చింది ఇదే ఇసుక. భవనాలు కట్టడమే కాదు, సమయం వస్తే రాజకీయ సౌధాలు కూడా కూలదోయగలమని ఇసుక ఇప్పటికే ఒకమారు రుజువు చేసింది. అందువల్ల ముప్పై శాతమే వ్యతిరేకత అని ఉదాశీనంగా ఉంటే ముప్పు ముందే పొంచి ఉంటుంది. జగన్ హామీలను బాగా నెరవేరుస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రధాన సమస్యలు కూడా తీరిస్తే జగన్ సర్కార్ మరిన్ని వెలుగులు నింపుకుని మరింతకాలం మంచి పనులు చేసేందుకు రెడీ అవవచ్చు.