మాస్టార్ కు మార్కులు ఇవ్వని స్టూడెంట్
విశాఖపట్టణం, అక్టోబర్ 30
విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయన టీడీపీ టూ వైసీపీ, వైసీపీ టూ వైసీపీ ఇలా చక్కర్లు కొడుతునే ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరితే కొడుక్కి టికెట్ ఇచ్చారు. మళ్ళీ రాజీనామా చేసి 2019 ఎన్నికల ముందు చేరితే కండువా మాత్రమే కప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత చూసుకుందామన్నారు. ఇపుడు అయిదు నెలల పాలన పూర్తి అయింది. పదవులు మాత్రం పలకరించడంలేదు. అక్కడికీ మాజీ మంత్రి హోదాలో దాడి వీరభద్రరావు జనంలోకి వెళ్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిందంటూ అధికారుల వద్ద హడావుడి చేస్తున్నారు. కానీ పదవి లేని రాజకీయం వేస్ట్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక తన కుమారుడు దాడి రత్నాకర్ రాజకీయ వారసుడుగా భావించిన దాడి వీరభద్రరావుకు కొడుకుకు సైతం ఏ పదవి దక్కకపోవడంతో నిరాశ ఆవరించిందట.జగన్ దాడి వీరభద్రరావు గురించి ఏమనుకుంటున్నారో ముఖ్యమంత్రి విశాఖ తాజా పర్యటనలో వెల్లడైంది. పూర్వాశ్రమంలో మాస్టారుగా పనిచేసిన దాడి వీరభద్రరావుని జగన్ కూడా రాజకీయ మాస్టారుని చేసేశారు. మా పాలన ఏపీలో ఎలా వుంది మాస్టారూ అంటూ జగన్ వాకబు చేయడం బట్టి చూస్తూంటే ఈ సీనియర్ సిటిజన్ కి పదవి దక్కదని తేలిపోయింది. జగన్ వద్దకు పని గట్టుకుని వచ్చి విశాఖ జిల్లా అభివృధ్ధిపై నివేదికను దాడి వీరభద్రరావు అందించారు. అందులో స్వామి కార్యం స్వకార్యం ఉన్నాయి. తనకు విశాఖ జిల్లా గురించి మొత్తం తెలుసు అన్నట్లుగా దాడి వీరభద్రరావు తన గురించి చెప్పకనే చెప్పుకున్నారు. కానీ జగన్ సైతం అంతే సింపుల్ గా చెప్పినవి వినేసి మొత్తానికి సలహాలు సూచనలు ఇవ్వండంటూ వ్యవహారం సరిపుచ్చేసరికి దాడి వీరభద్రరావు అనుచరులకు మింగుడుపడలేదుట.విశాఖ జిల్లా నుంచి ముగ్గురుని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జగన్ తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు అమరనాధ్, అదీప్ రాజ్ అయితే, ఒకరు పార్టీ నేత రాజీవ్. మరి ఈ ముగ్గురు సాటి తన కుమారుడు దాడి రత్నాకర్ చేయలేదా అని కూడా దాడి వీరభద్రరావు మధన పడుతున్నట్లుగా చెబుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల వరకూ నామినేటెడ్ పదవులు ఇవ్వమని చెప్పేస్తున్నారు. మరో వైపు పార్టీ పదవులు అయినా తమ కుటుంబానికి దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. అయితే జగన్ ఇచ్చే పదవులు సైతం ఆచీ తూచీ ఎంపిక చేసుకుంటున్నారు. ఎవరు పనికివస్తారు, భవిష్యత్తులో వారి నాయకత్వం పార్టీకి ఎలా ఉపయోగపడుతుందని బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. ఆ విధంగా చూస్తే మాస్టార్ కి కానీ ఆయన కుమారుడికి కానీ పెద్దగా మార్కులు పడలేదని అంటున్నారు. ఒకనాడు తాను పేపర్ దిద్ది మార్కులు వేసిన మాస్టార్ కి ఇపుడు జగన్ మార్కులు వేసి ఫెయిల్ చేయడం అంటే నిజంగా రాజకీయ విషాదమే.