ప్రైవేట్ కాలేజీలపై వేటు...
విజయవాడ, అక్టోబర్ 30
ఇటీవల విద్యా శాఖ అధికారులు విజయవాడలోని ప్రముఖ ఇంటర్ కాలేజీల్లో చేసిన తనిఖీల్లో కళ్లు చెదిరిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల్లో ఫీజులు, పోటీ పరీక్షల పేరిట వింత పోకడలను గుర్తించారు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన విషయాలను అధికారుల సీఎం సీఎం జగన్‌కు నివేదించినట్లు తెలుస్తోంది.ఈ సమీక్షలో ఇంటర్ ఫీజులు, పరీక్షలకు సంబంధించి అధికారులు విస్తుపోయే వాస్తవాలను సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. విజయవాడలో ప్రైవేటు కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఐపీఎల్ అంటూ ప్రీమియర్ లీగ్‌లు పెడ్డుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. ఐఐటీ పరీక్షల కోసం ఇలాంటి లీగ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫీజుల వసూలులో కూడా యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా దోపిడీ చేస్తున్నాయని వివరించినట్లు తెలుస్తోంది.ఇంటర్ విద్యకు ఏడాదికి రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకూ కళాశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. అయితే ప్రభుత్వానికిమాత్రం కేవలం రూ.2 వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారని అధికారులు వివరించినట్లు సమాచారం. స్పందించిన ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రైవేటు యూనివర్శిటీల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసే అవకాశం లేనప్పుడు వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు యూనివర్శిటీల్లో క్వాలిటీ లేనప్పుడు వారిచ్చే సర్టిఫికెట్లకు విలువ కూడా ఉండదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. విద్య వ్యాపారం కాదని, చట్టం కూడా అదే చెబుతోందన్నారు.విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై సిఫార్సులను ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సీఎం జగన్‌కు వివరించింది. ఇంగ్లీష్ మీడియం, పాఠ్యప్రణాళిక, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు, ఉపాధ్యాయులకు శిక్షణ, ప్రై వేటు స్కూళ్లలో ఫీజుల వసూలు, నాణ్యతాప్రమాణాల పరిశీలన తదితర అంశాలపై సీఎం సూచనలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యారంగంలో సంస్కరణలపై పని చేస్తున్న కమిటీ సభ్యులందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.