YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నవ్వుకోండి దేశీయం

మహారాష్ట్ర, హర్యనాలో పండని సెంటిమెంట్

మహారాష్ట్ర, హర్యనాలో పండని సెంటిమెంట్

మహారాష్ట్ర, హర్యనాలో పండని సెంటిమెంట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 30  
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు గుణపాఠంగానే చెప్పాలి. మహారాష్ట్రలో అత్యాశతో అతిగా లెక్కలు వేసుకున్న అధికార బీజేపీ, శివసేనల కూటమికి తోక కత్తిరించి అత్తెసరు మార్కులు వేశారు ఓటర్లు. చావు తప్పి కన్నులొట్టబోయింది. సర్కారు వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోలేక, పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజల తరఫున పోరాటంలో విఫలమవుతున్న కాంగ్రెసు, ఎన్సీపీ కూటమిని అధికారపు బోర్డర్ వద్ద ఆపేశారు. నాయకత్వ, పోరాటతత్వ లేమిని ప్రతిపక్షాలకు ఎత్తిచూపారు ఓటర్లు. ముఖ్యంగా నేలవిడిచి సాము చేస్తున్నాయి పార్టీలు. క్షేత్రస్థాయి వాస్తవాలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఏదో ఒక భావోద్వేగ అంశం, కులం, మతం అడ్డుపెట్టుకుంటూ పబ్బం గడిపేసుకోవాలనే పార్టీలు కొన్ని. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తే చాలు అందలమెక్కేయవచ్చని భావించే పార్టీలు మరికొన్ని. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో పరిష్కారదిశలో ప్రయత్నం చేద్దామనే కార్యాచరణే కరవు అయిపోతుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో పెద్ద ప్రజాతీర్పుగా అందరూ ఎదురుచూసిన ఫలితం అన్నిపార్టీలకూ కర్రుకాల్చి వాత పెట్టింది. ముఖ్యంగా బీజేపీకి హెచ్చరిక సంకేతాలు పంపింది.కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్ పై దాడులు వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంటును పతాకస్థాయికి తీసుకెళ్లడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎత్తుగడలు వేశారు. 15 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో సంక్షోభం, అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతినడం వంటి అంశాలేమీ పెద్దగా చర్చకు రాకుండా చూడాలని అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రంగానే ప్రయత్నించింది. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేశారు తప్పితే రాజకీయపార్టీల నుంచి వారికి లభించిన మద్దతు అంతంతమాత్రమే. అయినా ప్రజలే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హర్యానాలో త్రిశంకు సభకు ఆస్కారం ఇవ్వడం ద్వారా ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. అయినప్పటికీ తాము అధికారంలో ఉన్నపార్టీ పట్ల సంతృప్తిగా లేమని తేల్చి చెప్పారు. అదే సమయంలో కాంగ్రెసును పూర్తిగా అక్కున చేర్చుకోలేదు. నిత్యం పరీక్షను ఎదుర్కొనే రాజకీయ పార్టీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో తమ నిత్యజీవితంతో సంబంధం లేని అంశాలతో ఓట్లు కొల్లగొట్టడం ఎల్లకాలం సాధ్యం కాదని స్పష్టం చేశారనే చెప్పుకోవచ్చు.హైదరాబాద్ కేంద్రం గా ఉన్న ఎంఐఎం, బీజేపీలు రెండూ సిద్దాంతపరంగా వైరిపక్షాలు. అదే విధంగా అంబేద్కర్ ఐడియాలజీతో ఏర్పాటైన వంచిత్ బహుజన్ అగాధి(వీబీఏ) పార్టీ సైతం విధానపరంగా బీజేపీతో విభేదిస్తుంది. కానీ ఈరెండు పార్టీలు మహారాష్ట్రలో బీజేపీ,శివసేన కూటమికి నెత్తిన పాలు పోశాయి. ఈరెండు పార్టీలకు అత్యధికంగా మద్దతు పలికిన మైనార్టీ, షెడ్యూల్డు కులాల ఓట్లు సంప్రదాయంగా కాంగ్రెసు, ఎన్సీపీకి సానుభూతి వర్గాలుగా భావిస్తుంటారు. కానీ ఇప్పుడు సర్కారుకు వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడటంతో 35 నియోజకవర్గాల్లో ఎన్సీపీ, కాంగ్రెసు కూటమికి దెబ్బతగిలిందని అంచనా. రాజకీయ సమీకరణల్లో ఒక్కోసారి ఆగర్భశత్రువులు సైతం అనుకోని మిత్రులైపోతుంటారు. ఆరకంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత సంఘటితం కాకుండా కొంతమేరకు ఎంఐఎం,వీబీఏలు కాపు కాశాయనే చెప్పాలి. రెండు కూటములుగా పరస్పరం మోహరించుకుని తలపడితే కచ్చితంగా అధికారకూటమికి మరింత గట్టిపోటీ ఎదురయ్యేది. 2014 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, శివసేనలకు 25 స్థానాల వరకూ తగ్గాయి. పెద్దపార్టీగా బీజేపీనే ఎక్కువ సీట్లు కోల్పోయింది. ఎన్సీపీ పూర్తిగా కోలుకుంది. కాంగ్రెసు కూడా కొంతమేరకు పుంజుకుంది. చిన్నాచితక కూటములు సైతం కలిసి వచ్చి ఉంటే హర్యానా తరహాలోనే మహారాష్ట్రలో సైతం హంగ్ టెన్షన్ నెలకొని ఉండేది.హర్యానా రాష్ట్రం దేశ రాజధాని పక్కనే ఉంది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం సైతం చాలా ఎక్కువ. పారిశ్రామిక, వ్యవసాయరంగాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకోవడానికి హర్యానాలో తిరిగి అధికారం సాధించడం చాలా అవసరమని బీజేపీ అధిష్టానం భావించింది. సొంతంగా మెజార్టీ సాధించలేక బోల్తాపడటం నిరాశపరిచే ఘట్టమే. అధికారం కోసం వేరేపార్టీ ప్రాపకం కోసం పాకులాడాల్సిన పరిస్థితి కమలం వేగానికి పగ్గాలు వేసినట్లే. దాదాపు అన్ని ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ అంచనాలు బీజేపీకి రెండు రాష్ట్రాల్లోనూ బంపర్ మెజార్టీతో అధికారం కట్టబెట్టాయి. కానీ జరిగింది వేరుగా కనిపిస్తోంది. పోల్ ఆఫ్ పోల్స్ అంచనాల ప్రకారం మహారాష్ట్రలో అధికార కూటమికి 210 స్థానాలకు తగ్గకూడదు. కానీ 160 వద్ద కుచించుకుపోయింది. హర్యానాలోనూ బీజేపీకి తిరుగేలేదన్నట్లుగా 2014లో వచ్చిన 47 స్థానాలకు మించి సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ 40 వద్ద నిలిచిపోయింది. ఇవన్నీ చూస్తుంటే మీడియా సంస్థలు, సర్వే సంస్థలు శాంప్లింగ్ తీసుకోవడంలో తడబడుతున్నట్లుగా అనిపిస్తోంది . రకరకాలుగా ప్రభావితమవుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ అటు మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెసు కంటే గట్టి పార్టీగా నిలబడింది. ఇటు హర్యానాలో జననాయక్ జనతాపార్టీ చిన్నదైనప్పటికీ కీలక పార్టీగా అవతరించింది. ఈ రెండు పరిణామాలూ ప్రాంతీయ పక్షాల ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నాయి.

Related Posts