మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం అక్టోబర్ 30
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.