తరలిరానున్న సాహితీవేత్తలు, భాషా పండితులు
తెలుగు భాష వికాసానికి 26, 27, 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో తెలుగు సభల సంబరాల పేరుతో తెనాలిలో సాహిత్య సమ్మేళన సదస్సులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో సభల వివరాలను సాహితీ మిత్రులు, పురప్రముఖులతో కలిసి వెల్లడించారు. తెలుగు భాష, సాహిత్యం గొప్పదనాన్ని తెలపడంతో పాటు భాషా వికాసానికి అవసరమైన సమష్టి కృషిపై సదస్సులు జరుగుతాయని చెప్పారు.
* 26న ‘తెలుగు కోసం నడక’తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ముఖ్యఅతిథిగా, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసంతో ప్రారంభ సభ జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి అధ్యక్షులు జస్టిస్ గ్రంధి భవానిప్రసాద్, సినీ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డి.విజయభాస్కర్ పాల్గొంటారని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాల సాహిత్యంపై వాడ్రేవు చినవీరభద్రుడు అధ్యక్షతన నిర్వహించే సభలో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, కృష్ణకుమారి, చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, డి.సుజాతదేవి తదితరులు పాల్గొంటారని తెలిపారు. అదే రోజు మహిళా సాహిత్యంపై సభ జరుగుతుందన్నారు.
* 27న ‘భాషా వికాసం-సాహితీ ప్రక్రియ’అంశంపై జరిగే సభకు కె.శివారెడ్డి అధ్యక్షతన సాహితీవేత్తలు నగ్నముని, శ్రీరమణ, సి.యస్.రావ్, మీగడ రామలింగస్వామి, ధవళ సత్యం, కర్నాటి లక్ష్మీనరసయ్య, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు తదితరుల ప్రసంగాలుంటాయన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలకు ఎంపికైన దేవీప్రియ, వెన్నా వల్లభరావుకు సత్కారాలు చేయనున్నట్లు వివరించారు.
* 28న భాషా వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్ర, మాండలికాలు, సామాజిక వికాసంలో తెలుగు సాహిత్యం, భాషాభివృద్దిలో ప్రభుత్వం పాత్ర అంశాలపై సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓలేటి పార్వతీశం, కొలకలూరి ఇనాక్, ఎండ్లూరి సుధాకర్, డాక్టర్ చందు సుబ్బారావు, ఎన్.అంజయ్య, డాక్టర్ సామల రమేష్‌బాబు, బి.హనుమారెడ్డి, గారపాటి ఉమామహేశ్వరరావు, తదితరులు ప్రసంగాలు చేస్తారని పేర్కొన్నారు.
* ముగింపు సభలో రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర పర్యాటక, భాష, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, సాంఘిక, గిరిజన, సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రణాళికా సంఘం సభ్యులు పెద్ది రామారావు, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ పాల్గొంటారని వెల్లడించారు. అంతకుముందు తెలుగు సభల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు.