YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల సీఎంల ఫ్రెండ్ షిప్..ముగిసినట్టేనా

తెలుగు రాష్ట్రాల సీఎంల ఫ్రెండ్ షిప్..ముగిసినట్టేనా

తెలుగు రాష్ట్రాల సీఎంల ఫ్రెండ్ షిప్..ముగిసినట్టేనా
విజయవాడ, 
బీజేపీ రాజకీయ సిధ్ధాంతం ఐక్యత, అఖండ భారతం అంటారు కానీ రాజ‌కీయాల్లో మాత్రం ఆ పార్టీది ఫక్తు విభజించు పాలించు నీతి అంటారు. ఉమ్మడి ఏపీలో గెలవలేమని రెండు ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొట్టడానికి మద్దతు ఇచ్చిన పార్టీ ఇదే బీజేపీ. ఇక విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రోజూ కొట్టుకుంటూంటే చోద్యం చూసింది. వీలైతే మంటను కూడా పెట్టింది. అయితే ఏపీలో బాబు ఓడిపోయాక వైఎస్ జగన్ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పొరుగు రాష్ట్రంతో మంచిగా ఉండాలని ఆకాక్షించారు. దానికి తోడు అన్నట్లుగా కేసీఆర్ కూడా స్నేహ హస్తం అందించి పెద్దన్నగా వ్యవహరించారు. జగన్ ప్రమాణానికి కేసీఆర్ వచ్చి పౌరోహిత్యం నెరిపిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. పిలిచినా బీజేపీ పెద్దలు ఒక్కరూ నాడు హాజరుకాలేదు. ఇక గత అయిదు నెలలుగా జగన్ కేసీఆర్ ఒక్కటిగా ఉంటూ వస్తున్నారు. కానీ ఈ మధ్యనే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని ప్రచారం సాగుతోంది.కేసీఆర్, జగన్ దోస్తీ పాత సినిమాల్లో అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుకుతెచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు అప్యాయంగా పలకరించుకోవడం చూసి రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషించారు. ఉమ్మడి ఏపీ సమస్యలు ఈ విధంగానైనా తీరుతాయని అనుకున్నారు. దానికి తగినట్లుగా ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ఇద్దరూ ప్రదర్శించారు. అయితే ఇపుడు హఠాత్తుగా ఇద్దరి మధ్యన దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం బీజేపీ అన్న మాట కూడా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు కేసీఆర్, జగన్ దోస్తీ కంటగింపుగా మారిందని అంటున్నారు. ఒక్కటిగా 42 ఎంపీ సీట్లతో ఏపీ బలంగా ఉన్నందునే ముక్కలు చేశారన్న విమర్శ కూడా అప్పట్లో ఉంది. ఇపుడు విడిపోయినా కూడా కలసి కట్టుగా తమపై దండెత్తితే ఇబ్బందికరమే కదా. అందుకే జగన్ కి గట్టి జాగ్రత్తలే బీజేపీ వైపు నుంచి వచ్చాయని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ తో రాజకీయ యుధ్ధం చేస్తున్న బీజేపీకి జగన్ ఇప్పటికిపుడు టార్గెట్ కాదు. అందువల్ల కేసీఆర్ తో జగన్ దోస్తీకి కటీఫ్ చెప్పేలా కాషాయం సుతిమెత్తని సందేశాలను పంపిందని అంటున్నారు. దాని ఫలితంగానే జగన్ దూరం పాటిస్తున్నారని చెబుతున్నారు.ఇదిలా ఉండగా ఈ దోస్తీ బ్రేకప్ కావడానికి కేసీఆర్ పెద్దన్న పాత్ర, అతి జోక్యం కూడా మరో కారణం అని కూడా అంటున్నారు. జగన్ తాను ఎంత చెబితే అంత అన్నట్లుగా కేసీఆర్ అతి ఉత్సాహంతో ఫోకస్ ఇవ్వడం కూడా కమలనాధులకు కన్నెర్ర అయిందని చెబుతున్నారు. దాంతో వారు ఇద్దరు మిత్రుల కధకు శుభం కార్డ్ పలకాలని భావించారని, కేంద్రంలోని పెద్దలలో వచ్చిన మార్పు తేడాలను గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా జాగ్రత్తపడ్డారని కూడా ప్రచారంలో ఉంది. అదే విధంగా కేసీఆర్ హై హ్యాండ్ తీరు కూడా జగన్ ని చికాకు పెడుతోందని అంటున్నారు. ఇక ఆర్టీసీ విలీనం విషయంలో ఏపీ సీఎం చేసిందేమీ లేదంటూ అక్కడ ఏముంది మన్ను తప్ప అని కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన హాట్ కామెంట్స్ ఇద్దరు మిత్రుల అనుబంధాన్ని ముక్కలు చేసేవే. ఇక జగన్ సైతం ఆర్టీసీ మీద వర్కింగ్ గ్రూప్ ని నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకునేలా వ్యవహరించారు, అలా కేసీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా ఏపీలోనే గోదావరి మిగులు జలాలతో కృష్ణాకు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు పంపించే ప్రాజెక్టులకు జగన్ కొత్తగా తెర తీశారు. అంటే ఉమ్మడి గోదావరి ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. మొత్తానికి ఇప్పటికైతే విభేదాలు ఉన్నాయి. అవి ముందు ముందు ఎలా ముదురుతాయో చూడాలి మరి.

Related Posts