టీడీపీలో లోకేష్ యాంటి సెంటిమెంట్
హైద్రాబాద్,
ఆయన టీడీపీలో అధికారంలో ఉంటే మాస్టర్ మైండ్. ఉమ్మడి ఏపీలో చంద్రబాబుకు సైతం సలహాలు ఇచే అసమాన నైపుణ్యం ఆయన సొంతం. ఇపుడే ప్రధాని పదవి వద్దు నాన్నారూ అని 1996 దేశ సంకీర్ణ రాజకీయాల ఎపిసోడ్ లో లోకేష్ బాబు చెప్పారని చంద్రబాబు చెప్పుకుని తరచూ మురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చినబాబు పవర్ సెంటర్ గా మారిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన ఐటీ మంత్రిగా పదవిని ఎమ్మెల్యే కాకుండానే కోరి మరీ తీసుకున్న లోకేష్ చంద్రబాబు ఆ తరువాత ఎంత వరకూ ఐటీని డెవలప్ చేశారో అందరికీ తెలిసిందే. సరే మంగళరిగికి పోయి ఓటమిని మూటకట్టుకొచ్చిన తరువాత లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి గత అయిదు నెలలుగా చేస్తున్నదేంటన్నది పెద్ద ప్రశ్న. జవాబు కూడా సులువే. ఏపీలో చంద్రబాబు రాజకీయం అంతా చూశారు, చూస్తున్నారు. ఆయన వయసు డెబ్బయి ఏళ్ళు. ఆయన పార్టీని ఈ వయసులో కూడా లాగాలని తెగ కష్టపడుతున్నారు. అదే సమయంలో మరో అయిదేళ్ల వరకూ ఎన్నికలు లేని వేళ చంద్రబాబు బలం ఎంతవరకూ సరిపోతుంది. చంద్రబాబు ఒక్కరే టీడీపీని ఒడ్డున పడేయగలరా అన్న సందేహాలు తమ్ముళ్లను పట్టిపీడిస్తున్నాయి. పైగా చంద్రబాబు తరువాత పార్టీకి మేమంటూ ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు వస్తే, జనాదరణ పొందితే తమ్ముళ్ళు కుదుటపడతారు. కానీ లోకేష్ మాత్రం ట్విట్టర్ పిట్టగా మారిపోయారు తప్ప పార్టీ కోసం చేసినది ఏదీ లేదని అంటున్నారు. ఆయన రోజుకొక ట్వీట్ ఏకంగా సీఎం జగన్ ని ట్యాగ్ చెస్తూ పడేస్తే తన ప్రతిపక్ష పాత్ర పూర్తి అయినట్లుగా భావిస్తున్నారు. మరి జనంలోకి వెళ్ళడం, పార్టీలో పట్టు పెంచుకోవడం వంటివి చేయకుండా షార్ట్ కట్ మెథడ్స్ మీదనే ఆయన ఆధారపడుతున్నారు.ఈ విషయంలో సొంత పార్టీ నుంచే లోకేష్ మీద సెటైర్లు పడుతున్నాయి. ఆయనకు తన నాయకత్వంపై తనకే నమ్మకం లేకనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు తమ్ముళ్ళు సైతం చంద్రబాబే బెటర్ లోకెష్ కంటే అంటున్న తీరుని చూసి ఆయన గమ్మున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా మార్పు వస్తే, పార్టీలో పరిస్థితి అనుకూలంగా మారితే అపుడు జనంలోకి రావచ్చునని లోకేష్ అనుకుంటున్నాడుట. అయితే లోకేష్ రెండు జిల్లాల్లో ఇప్పటికే పర్యటించారు. విశాఖ వస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ్ముడు పార్టీని వీడిపోయాడు. తూర్పు గోదావరి వెళ్తే సీనియర్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జెండా ఎత్తేశారు. దీన్ని యాంటీ సెంటిమెంట్ గా భావించే లోకేష్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా ముందు తన నాయకత్వం రుజువు చేసుకుంటేనే లోకేష్ కి పార్టీ మీద పట్టు దొరుకుతుందని, అలా కాకుండా ఆయన అనుకూల సమయం అని వేచి చూస్తానంటే మాత్రం టీడీపీ పుట్టె మునగడం ఖాయమని అంటున్నారు