పర్చూరుపై తేల్చుకోలేకపోతున్న వైసీపీ
ఒంగోలు,
పర్చూరు నియోజకవర్గం వైసీపీలో చిచ్చురేపేలా ఉంది. ఓటమి పాలయినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన తనకుమారుడు దగ్గుబాటి హితేశ్ భవితవ్యం గురించే వైసీపీలో చేరారన్నది వాస్తవం. ఆయనకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ దశాబ్దకాలం క్రితమే పోయింది. అయితే పర్చూరు విషయంలో ఎటూ తేల్చేలేకపోతున్నారు వైసీపీ అధినేత జగన్ కూడా. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కేవలం నేత మాత్రమే కాదు ఒక బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్. అందుకే జగన్ పర్చూరు నియోజకవర్గంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంద్రీశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. పురంద్రీశ్వరికి వెంటనే కాకున్నా త్వరలోనే కేంద్రంలో పదవి లభిస్తుందన్న ఆశ ఉంది. బీజేపీ అధినాయకత్వం కూడా పురంద్రీశ్వరి పట్ల సానుకూలత ఉంది. అదే వైసీపీలో పర్చూరు ఇన్ ఛార్జి తప్ప మరొకటి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గాని, ఆయన కుమారుడు హితేశ్ కు గాని లభించే అవకాశం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నా సామాజిక సమీకరణాలు అనుకూలించవు. చిలకలూరి పేట నుంచి మర్రి రాజశేఖర్ కు ఆల్రెడీ జగన్ హామీ ఇచ్చారు.అందుకే దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ పెట్టిన షరతులకు అంగీకరించలేదంటున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినా ఇప్పటికిప్పుడు తమకు రాజకీయంగా జరిగే నష్టం లేదన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. జగన్ పెట్టే షరతులకు లొంగి భార్య పురంద్రీశ్వరి భవిష్యత్తును కాలరాయడం దగ్గుబాటికి ఇష్టం లేదు. అందుకే ఆయన విజయసాయిరెడ్డికి తన మనసులో మాట చెప్పేశారు. తాను వైసీపీలో ఉండదలచుకోలేదని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాకుండా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు.జగన్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇప్పటివరకూ దగ్గుబాటిని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన రావి రామనాధం బాబును తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. అయితే రావిపాటి రామనాధంను ఇన్ ఛార్జిగా నియమిస్తామని ఫిల్లర్లు వదిలింది. అయినా దగ్గుబాటి దిగిరాకపోవడంతో జగన్ పునరాలోచనలోపడినట్లు తెలిసింది. దగ్గుబాటి హితేశ్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించాలని పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల నుంచి వత్తిడి పెరుగుతోంది. దీంతో జగన్ కొద్దిరోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు