హైద్రాబాద్ లో బాదుడే... బాదుడు...
పెనాల్టీలతో కోటిన్నర ఆదాయం
హైద్రాబాద్,
హైదరాబాద్ నగరపాలక సంస్ధ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన పలు వ్యాపార సంస్ధలు, నివాసాలు, గృహ యజమానుల నుంచి భారీ ఎత్తున జరిమానాలు వసూలు చేసింది జీహెచ్ఎంసీ. గడిచిన 5 నెలల కాలంలో వివిధ ఉల్లంఘనల కింద కోటీ 50 లక్షలు వసూలు చేశారు. హైటెక్ సిటీ సమీపంలోని పత్రికానగర్ లో ఇంటి నిర్మాణం చేస్తూ.. శిథిలాలను రోడ్డుపై పడేసినందుకు ఇంటి యజమానికి రూ.10లక్షల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆస్తి పన్ను బకాయిలు, ఫ్లోటింగ్ బాండ్లను వసూలు చేయడం ద్వారా జీహెచ్ఎంసీ తన ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. రూపాయి టర్మ్ లోన్ (ఆర్టీఎల్) ద్వారా డబ్బును సేకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. బాండ్లు, ఆర్‌టీఎల్ ద్వారా సేకరించిన డబ్బును ఎస్‌ఆర్‌డిపి కింద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉపయోగిస్తామని జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి.పత్రికా నగర్ లో నివసించే రజనీ కాంత్.. తన ఇంటి నిర్మాణం సమయంలో ఉపయోగించిన వ్యర్దాలను రోడ్డుపై పడేశారు. ఇంటి నిర్మాణం సమయంలో ఇంటి గోడ కూలి పక్కనే ఉన్న పార్క్ పై పడింది. అయినప్పటికీ శిధిలాలను తీయకుండా నిర్లక్ష్యం వహించి అలాగే వదిలేయటంతో అధికారులు అతనికి జరిమానా విధించారు.ఒక హోటల్ యజమాని హోటల్లో ఉపయోగించిన నీటిని రోడ్డుపై పోసినందుకు అక్టోబరు 26న రూ.1 లక్ష జరిమానా విధించారు. అనుమతులు తీసుకోకుండా పైప్ లైన్, డ్రయినేజ్ లైన్ కోసం రోడ్డును తవ్వినందుకు ఒక బిల్డర్ కు రూ. 5 లక్షలు జరిమానా విధించారు. 2019, మే 24 నుంచి అక్టోబర్ 10 వరకు కార్పొరేషన్ 8,475 సంస్థల నుంచి రూ.1.03 కోట్లు వసూలు చేసింది. ఇది అక్టోబరు 26నాటికి రూ .1.5 కోట్లు చేరుకుంది. ఈ జరిమానాలు నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా విధించబడుతున్నాయి" అని జీహెచ్‌ఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చందానగర్ సర్కిల్‌లో రూ.16,90,300, శేరిలింగంపల్లి సర్కిల్లో రూ. 13,90,200, ఖైరతాబాద్ సర్కిల్లో రూ .8,41,400 అత్యధిక జరిమానాలు వసూలు చేశారు.నాలాలు.. బహిరంగ ప్రదేశాల్లో శిధిలాలు, చెత్తా చెదారం పడేయడం, రోడ్లపైకి నీరు పోయడం, బహిరంగ ప్రదేశాలలో చెత్తకుప్పలు వేయడం, నిషేధిత ప్లాస్టిక్ సంచుల వాడకం, చెత్త, పరిశుభ్రమైన ప్రాంగణాలను తగలబెట్టడం.... లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వాణిజ్య సంస్ధలపై అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు.