ప్రాణాల మీదకు ఆర్టీసీ బస్సులు
హైద్రాబాద్, అక్టోబర్ 31 :
హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తుని నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరణించిన వారిని కోహెడ గ్రామానికి చెందిన రమణారెడ్డి, విజయమ్మగా గుర్తించారు.రమణారెడ్డి బండ్లగూడ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. తమ బంధువుల గృహ ప్రవేశ వేడుక కోసం భార్యతో కలిసి బైక్ మీద కోహెడ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ బయల్దేరారు. పెద్ద అంబర్ పేట వద్ద ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వీరు వెళ్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. దీంతో దంపతులిద్దరూ అక్కడిక్కడే మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రమణారెడ్డి దంపతుల మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆర్టీసీ కార్మికులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద వార్త తెలియడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు కార్మికులు భారీ సంఖ్యలో పెద్ద అంబర్ పేటకు చేరుకున్నారు. విజయవాడ హైవే దిగ్భంధం చేశారు. రమణారెడ్డి కుటుంబానికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.