తిరుమలలో వంద మందికి ఉద్వాసన
తిరుమల, అక్టోబర్ 31 :
టీటీడీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పని చేస్తున్న రిటైర్డ్ అధికారులు, సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేస్తోన్న రిటైర్డ్ అధికారులను తొలగించాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్వాసన పలికే 100 మందితో జాబితాను సిద్ధం చేసింది. మార్పులు చేర్పులతో గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారటీటీడీ వేటు పడే జాబితాలతో శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై వేటు పడకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సుదీర్ఘ కాలం టీటీడీలో పని చేసిన డాలర్ శేషాద్రికి.. శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, వ్యవహారాలపై మంచి పట్టుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రముఖుల అవసరాలను ఆయనే తీరుస్తారని ప్రచారంలో ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే.. డాలర్ శేషాద్రిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.నిత్య అన్నదాన ప్రసాదం ట్రస్టు ప్రత్యేకాధికారి వేణుగోపాల్, దేవస్థానం ఉప న్యాయాధికారి వెంకట సుబ్బనాయుడు, ఎస్వీ రికార్డింగ్ ప్రత్యేకాధికారి మునిరత్నం రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమన్వయకర్త చెంచురామయ్య తదితరులు తొలగింపు జాబితాలో ఉన్నారని సమాచారం. మునిరత్నం రెడ్డి బుధవారమే రాజీనామా చేశారు.టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న సమాచార కేంద్రాలు, కళ్యాణ మండపాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. టీటీడీ నిర్ణయంతో వీరిపై వేటు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే టీటీడీలో సిబ్బంది కొరత ఉంది. దీంతో వీరికి ఉద్వాసన పలికిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.