నటి గీతాంజలి మృతి పట్ల సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
హైదరాబాద్
తెలుగు సినిమాలపై గీతాంజలి చెరగని ముద్ర వేశారని సీఎం జగన్ పేర్కొన్నారు. అలనాటి తార గీతాంజలి గురువారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుగు సినిమాకు గీతాంజలి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సీతారామ కల్యాణంతో పాటు అనేక తెలుగు చిత్రాల్లో గీతాంజలి ప్రదర్శించిన నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుందని కేసీఆర్ అన్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సైతం సోషల్మీడియా వేదికగా గీతాంజలి మృతిపట్ల సంతాపం తెలపడంతోపాటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ‘ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ఆ తర్వాత హాస్యనటిగా రాణించిన నటీమణి గీతాంజలి మరణం విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.