చంపేస్తున్న చదువులు
హైద్రాబాద్, అక్టోబర్ 31 :
చదువు చంపేస్తోంది. మార్కుల మహా యజ్ఞం జీవితాలను బలి చేస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సరస్వతీ నిలయాలు మృత్యునిలయాలుగా మారుతున్నాయి. మార్కుల ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్స్ చావుకేకలు వేస్తున్నారు. మోయలేని బరువు, తీరికలేని చదువు, కరువైన పలకరింపుతో ఉక్కిరిబిక్కిరిఅవుతోన్న విద్యార్ధులు తనువు చాలిస్తున్నారు. మార్కుల యజ్ఞంలో అక్షరాల చీమలతో విద్యార్దులు పోరాడుతున్నారు. బందిఖానాలాంటి తరగతి జైలు గదుల్లో చదువు శిక్షను అనుభవిస్తున్నారు. ఒత్తిడి భరించలేని విద్యార్ధులు తమ జీవితాలకు అదే మరణ శిక్షగా మార్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కందిగ్రామంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన విద్యార్ధుల వరుస ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం. చదువుల ఒత్తిడిని తట్టుకోలేక థర్ట్‌ఇయర్ చదువుతోన్న సిద్దార్ధ బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా మంచి స్కోర్ సాధించలేకపోతున్నానని,చావుకు కొన్ని నిమిషాల ముందు ఫ్రెండ్స్‌కు ఈమెయిల్స్ ద్వారా తన ఫీలింగ్‌ను చెప్పుకున్నాడు. ఎప్పుడు ఫస్ట్ ఉంటే తాను ఇలా వెనకబడటం భరించలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పడం కలిచివేసింది. గతంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల మానసిక స్థితి ఇంచుమించు ఇలాంటి స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుధ్య, మార్క్ ఆండ్రు చార్లెస్ , ఇప్పుడు సిద్దార్ధ ఆత్మహత్యలు దాదాపు ఒకలాగే ఉన్నాయి. ఎంతో కష్టపడి చదివి విద్యార్థులు తీరా ఐఐటీలో ప్రవేశించి చదువు మధ్యలో ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్నాళ్లలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరుతాడన్న సమయంలో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది. విద్యార్థుల్లో ఈ మానసికస్థితిని తొలిగించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అధ్యాపకులు, సైకాలజిస్టులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.