టీ కేబినెట్ లో ప్రైవేట్ పైనే చర్చ
హైద్రాబాద్, అక్టోబర్ 31 :
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం జరగనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించనుంది. ప్రైవేటు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల మీదా చర్చించే అవకాశముంది. నవంబర్ నెలాఖరులో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.ఆర్టీసీ సమ్మె ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సమ్మె 27వ రోజుకి చేరింది. కార్మికుల సమ్మెతో ప్రయాణికుల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్న కొద్దిపాటి ఆర్టీసీ సర్వీస్‌లు ప్రయాణికుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల ఛార్జీలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం దృష్టి పెట్టింది.ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 3వేల నుంచి 4వేల రూట్లలో ప్రైవేట్ బస్‌లకు పర్మిట్లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెయ్యి రూట్లలో ప్రైవేటు పర్మిట్ల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే.. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. 21 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. కేబినెట్‌లో చర్చించి ప్రైవేట్ బస్‌లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.