ఆర్టికల్ 370 రద్దు... పటేల్ కు అంకితం
గాంధీనగర్, అక్టోబర్ 31
బర్డోలీ వీరుడు, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహాం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. అనంతరం ‘ఏక్‌తా దివస్’ పరేడ్‌లో పాల్గొని ప్రసంగించిన మోదీ.. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఐక్యతే మన సంస్కృతి, సంప్రదాయం, కల అని ప్రధాని ప్రశంసించారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వేషభాషలు మన దేశానికే ప్రత్యేకమని అన్నారు. ఐక్యత గురించి మన ఇతిహాసాలు సైతం విశదీకరించాయని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి ప్రపంచదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఐక్యత, వైవిధ్యంలో మనం ఎప్పుడూ రాజీపడలేదని, భారత సమగ్రతకు పటేల్ విగ్రహం చిహ్నమని అన్నారు.దేశ ఐక్యత విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గదర్శకాలను అనుసరించాలని, ఆయన వ్యక్తిత్వమే మనకు ఓ పవిత్రమైన సందేశమని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాలూ ఐక్యత కోసం పాటుపడుతున్నాయని, దీనిని కొనసాగించడం ఇప్పుడు భారత్‌కు సవాల్‌గా మారిందని అన్నారు. ఈ సవాల్‌ను మనమంతా స్వీకరించి ఐక్యతను నిలబెడతామన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. మనపై యుద్ధం చేసి గెలవలేని వారు మన ఐక్యతను దెబ్బతీయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పటేల్ వంటి మహనీయలను స్ఫూర్తిగా తీసుకోవాలని, కుటిల యత్నాలు చేసే వారికి తగిన గుణపాఠం చెప్పాలని పరోక్షంగా పాక్‌ను మోదీ హెచ్చరించారు.ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే ఆర్టికల్ 370 అమల్లో ఉండేదని, ఇది అక్కడ ఉగ్రవాదాన్ని పెంచిపోషించిందని మోదీ అన్నారు. స్వయం ప్రతిపత్తిని రద్దుచేసి భారత్‌ను ఒక్కటి చేశామని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఉగ్రవాదులకు కశ్మీర్ స్థావరంగా మారిందని, ఉగ్రవాదం కారణంగా గత మూడు దశాబ్దాల్లో 40వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నారని చెప్పారు. అరాచక శక్తులను అణచివేయడానికే ఆర్టికల్ 370 రద్దు చేశామని, దీనిని పటేల్‌కు అంకితమిస్తున్నామని ప్రధాని తెలిపారు.కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేయడంతోనే పటేల్ కల నెరవేరిందన్నారు. సమైక్యతా పూజారి పటేల్ జయంతి సాక్షిగా జమ్మూ కశ్మీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని అని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను వేరుచేసి కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టామని అన్నారు. పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో భావోద్వేగ, ఆర్ధిక, రాజ్యాంగ సమైక్యత దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.