కొత్త తరహా మోసాలకు సిద్ధమౌతున్న సైబర్ నేరాలు
విజయవాడ, అక్టోబర్ 31 :
లాటరీలో బహుమతి వచ్చింది.. అది పంపేందుకు సర్వీస్ చార్జీలు చెల్లించాలంటూ ఎస్‌ఎంఎస్‌లు వచ్చేవి. అలా వచ్చిన మెసేజ్‌లకు స్పందించి నగదు పంపించి మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి నేరాలపై కాస్త అవగాహన పెరగడంతో సైబర్ కేటుగాళ్లు కొత్తతరహా మోసాలకు తెగబడుతున్నారు. పెద్దమొత్తంలో నగదు వేయమంటే అనుమానం వస్తుందని.. రూ.11, రూ.21లు చెల్లిస్తే చాలని ఎరవేసి బ్యాంకు ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన అర్జునరావుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీకు పార్శిల్ వచ్చింది. డెలివరీ ఇచ్చేందుకు ఒక మెసేజ్ పంపిస్తాం. దాని ద్వారా కేవలం 11 రూపాయలు చెల్లిస్తే పార్శిల్ ఇస్తామని చెప్పారు. చిన్నమొత్తమే కదా అని మెసేజ్ లింక్ ద్వారా ఆ రూ.11లు చెల్లించాడు. కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.70 వేలు మాయమయ్యాయి. వేరే ఖాతాకు బదిలీ చేసినట్లు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రావడంతో అర్జునరావు కంగుతిన్నాడు.వెంటనే తనకు ఫోన్ వచ్చిన నంబర్‌కు తిరిగా కాల్ చేశాడు. ఆ నంబర్ పనిచేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. లింక్‌పై క్లిక్ చేయడం ద్వారానే ఖాతాలోని నగదు అపహరించినట్లు తెలుస్తోంది.మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపై ఎస్‌ఎంఎస్ లింక్స్‌పై క్లిక్ చేసే ముందు కాస్త ఆలోచించుకోవడం బెటర్