YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ పర్మిట్స్ కుఅంతా సిద్ధం... కేబినెట్ ఆమోద ముద్రే తరువాయి 

ప్రైవేట్ పర్మిట్స్ కుఅంతా సిద్ధం... కేబినెట్ ఆమోద ముద్రే తరువాయి 

ప్రైవేట్ పర్మిట్స్ కుఅంతా సిద్ధం...
కేబినెట్ ఆమోద ముద్రే తరువాయి 
హైద్రాబాద్, 
ఆదాయం వచ్చే లాంగ్ రూట్లన్నీ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పజెప్పేందుకు ప్రభుత్వ పెద్దలు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. శనివారం జరుగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ఆమోదం కూడా తెలిపే చాన్స్ కనిపిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే.. వారంలోపే నోటిఫికేషన్, టెండర్ల విధివిధానాలు కూడా విడుదల అవుతాయి. సుమారు 3 వేల నుంచి 4 వేల రూట్లను ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని వారు అంటున్నారు. లాభాలు వచ్చే లాంగ్ రూట్లను ప్రైవేట్కు అప్పగిస్తే.. ఆర్టీసీ బస్సులు కేవలం పల్లెలకు, సిటీకే పరిమితం కావాల్సి వస్తుంది. ఆర్టీసీలో 20 శాతం రూట్లను ప్రైవేట్కు ఇచ్చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.తక్కువ డిస్టెన్స్‌‌ ఉన్న రూట్లలో బస్సులు నడపడం వల్ల నష్టం ఎక్కువగా వస్తుందని, అందుకే ఆ రూట్ల జోలికి ప్రైవేటు ఆపరేటర్లు ముందుకు రారని ఆర్టీసీ యూనియన్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రైవేట్కు అప్పజెప్పదలచిన బస్సు రూట్లు లాంగ్‌‌ డిస్టెన్స్‌‌వే ఉన్నాయని అంటున్నారు. మూడు వేల నుంచి నాలుగు వేల రూట్లను ప్రైవేట్కు అప్పజెప్పే పనిలో ప్రభుత్వం ఉందని, మొదట 20 శాతం అని చెప్పినా అది 30 శాతం వరకు ఉన్నట్లు అధికారుల ద్వారా  సమాచారం అందిందని యూనియన్ నేతలు చెబుతున్నారు. శనివారం జరిగే కేబినెట్‌‌ సమావేశంలో ఈ రూట్లకు ఆమోదం లభిస్తుందని ఓ కీలక అధికారి చెప్పారు. కేబినెట్‌‌ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ రాగానే టెండర్లకు విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. నవంబర్‌‌ మొదటి వారంలో నోటిఫికేషన్‌‌ ఇచ్చి నాలుగైదు రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగిస్తామన్నారు. ఇదే గనుక జరిగితే ఆర్టీసీలోని ప్రాఫిట్‌‌ రూట్లన్నీ ప్రైవేటు పరం అవుతాయి. నష్టాలను తెచ్చే బాటల్లోనే ఆర్టీసీని నడుపుకోవాల్సి వస్తుంది. అంటే సీఎం చెబుతున్నట్లుగా పాత ఆర్టీసీ ఇక వెయ్యి శాతం ఉండదు.ఏ రూట్లకు డిమాండ్ ఉంది? ఏ రూట్లను అమ్మితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది? అనే అంశాల ఆధారంగా లిస్టును తయారుచేసి వారు  ప్రగతిభవన్కు పంపించినట్లు తెలిసింది. దాన్ని సీఎం పరిశీలించగానే.. తుది జాబితాను తయారుచేసి శనివారం మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశానికి పంపించనున్నారు. అయితే ప్రైవేటుకు అప్పజెప్పే రూట్లు 20 శాతం కన్నా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 30 శాతం రూట్లలో ప్రైవేటు అద్దె బస్సులు నడపడానికి రెండు విడతలుగా టెండర్లు పిలిచారు. ఇందులో లాంగ్‌‌ రూట్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. వంద, రెండు వందల రూట్లకు వేలల్లో అప్లికేషన్లు వచ్చాయి. తాజాగా 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటు స్టేజీ క్యారియర్లకు అప్పగిస్తే ఆర్టీసీ కథ ముగిసినట్లుగా భావించవచ్చని ఆర్టీసీ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.లాంగ్‌‌ రూట్లన్నీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తే.. నష్టాల బాటలైన పల్లె వెలుగు, సిటీ బస్సులను మాత్రమే ఆర్టీసీ నడుపుకోవాల్సి వస్తుందని సంస్థ అధికారులు అంటున్నారు. ఇపుడున్న నష్టాలకు ఈ రూట్లే ప్రధాన కారణం. ఆర్టీసీ నడుపుకోవడానికి ఇవే రూట్లు మిగిలితే భవిష్యత్లో మరిన్ని నష్టాలు తప్ప లాభాలు వచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆర్టీసీ పూర్తిగా దివాలా తీస్తుందని, డొల్ల కార్పొరేషన్‌‌గా మారుతుందని యూనియన్‌‌ నేతలు, కార్మికులు అంటున్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందనడానికి ఇంతకన్నా సంకేతాలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. దీన్ని నిరసిస్తూనే సమ్మెకు దిగామని చెబుతున్నారు. కోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా తన పని తాను చేసుకుపోవడం ఎంత వరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు. ఆర్టీసీకి రోజూ 11 కోట్ల వరకు ఆదాయం వస్తే.. ఖర్చు మాత్రం 13 కోట్లకు పైగా ఉంటోంది. అంటే రోజూ సుమారు 2 కోట్ల వరకు నష్టం వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ నష్టంలో ప్రధాన వాటా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పే పల్లె వెలుగు, హైదరాబాద్‌‌లో నడిచే సిటీ బస్సుల మీదే ఉంటుంది. సిటీ బస్సులపై ఆర్టీసీకి ఏటా రూ. 450 కోట్ల నష్టం వస్తుంటే, గ్రామీణ ప్రాంతాల బస్సులపై  రూ. 300 కోట్ల వరకు నష్టం వస్తోంది. ప్రస్తుతం ఈ నష్టానికి సంబంధించి ఆర్టీసీపై రూ. 3,200 కోట్ల భారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీకి ఎంతో కొంత లాభాన్ని తెచ్చి పెట్టే లాంగ్ రూట్లలో ప్రైవేట్ స్టేజీ క్యారియర్లు (ప్రైవేట్ బస్సులు) ప్రవేశపెడితే సంస్థ దివాలా తీయకతప్పదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల నుంచి హైదరాబాద్‌‌ తదితర పట్టణాలకు నడిపే లాంగ్‌‌ రూట్లతో లాభాలు వస్తాయి. తక్కువ దూరాలతో కూడుకునే గ్రామీణ ప్రాంత బస్సులు, సిటీలో తిరిగే బస్సులతో నష్టాలు వస్తాయి. అందుకే పల్లె వెలుగు బస్సుల నష్టాన్ని పూడ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని ఆర్టీసీ అడుగుతూ వస్తోంది. సిటీలో తిరిగే బస్సుల నష్టాన్ని జీహెచ్‌‌ఎంసీ భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్టాలు వస్తున్నా సామాజిక బాధ్యతగా పల్లెల్లో, సిటీలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నందున ఆయా ప్రాంతాల్లోని నష్టాలను ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్ఎంసీ భరించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి, జీహెచ్ఎంసీ నుంచి నిధులు రావడం లేదని కార్మికులు అంటున్నారు. పైగా లాభాలు తెచ్చే లాంగ్ రూట్లలో ప్రైవేటు అద్దె బస్సులు నడుపుతున్నారు. ప్రైవేటు అద్దె బస్సుల వల్ల కొన్ని రూట్లలో లాభాలు, మరికొన్ని రూట్లలో నష్టాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇందులో లాభాలు ఉన్న రూట్లను ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్కు ఇచ్చేస్తే ఆర్టీసీకి నష్టాలు తప్ప ఏ రోజూ లాభాలు ఉండవని కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు.
ప్రైవేటు యజమాని నుంచి బస్సులను అద్దెకు తీసుకొని ఆర్టీసీ నడుపుతుంటుంది. దాంతో సంస్థకు కొంత ఆదాయం వస్తుంది. అందులో నుంచి కొంత బస్సు యజమానికి సంస్థ అప్పజెప్తుంది. అద్దె బస్సులకు డ్రైవర్‌‌ని యజమాని నియమించుకుంటే.. కండక్టర్‌‌ను ఆర్టీసీ రిక్రూట్‌‌ చేస్తుంది. పూర్తిస్థాయి ప్రైవేట్ బస్సు అయితే దానిపై ఆర్టీసీ అజమాయిషీ ఏమీ ఉండదు. నియంత్రణ ఉండదు. ఫలితంగా తాము రూట్లపై పట్టు కోల్పోవడమే కాకుండా ఉద్యోగాల సంఖ్య కూడా తగ్గుతుందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.ఆర్టీసీలో ప్రస్తుతం 10,450 బస్సులున్నాయి. ఇందులో 8,357 ఆర్టీసీ సొంత బస్సులు కాగా.. 2,103 ప్రైవేటు అద్దె బస్సులున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు అద్దె బస్సుల కోసం రెండు సార్లు టెండర్లు పిలిచింది. మొదటి దశలో 1,035, రెండో దశలో 1,248 బస్సులకు టెండర్లు పిలిచింది. వివిధ రూట్లకు సంబంధించి పిలిచిన ఈ టెండర్లలో కేవలం ఆదాయం వచ్చే లాంగ్‌‌ రూట్‌‌ సర్వీసులకే మంచి రెస్పాన్స్‌‌ వచ్చింది. ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌, వరంగల్‌‌, మహబూబ్‌‌నగర్‌‌లో వందల సంఖ్యలో బస్సులకు టెండర్లు పిలువగా వేలాది అప్లికేషన్లు వచ్చాయి. వరంగల్‌‌లో 125 బస్సులకు టెండర్లు పిలవగా 4,500 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్‌‌లో 18 బస్సులకు టెండర్ పిలువగా 1,510 అప్లికేషన్లు వచ్చాయి. మహబూబ్‌‌నగర్‌‌లో 132 బస్సులకు గాను 3,396, కరీంనగర్‌‌లో 140 బస్సులకు గాను ఐదు వేల వరకు అప్లికేషన్లు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్‌‌ సిటీ రూట్కు సంబంధించి మొదటి దశలో 760 బస్సులకు 12, రెండో దశలో 248 బస్సులకు గాను 332 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి లాంగ్‌‌ రూట్లకు ఉండే డిమాండ్‌‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. షార్ట్‌‌ రూట్లకు ప్రైవేటు ఆపరేటర్లు ఆసక్తి చూపడం లేదని ఈ దరఖాస్తులే చెబుతున్నాయి.రూట్లను ప్రైవేటుకు అప్పగించే విధానంలో ఒకసారి రూటు కోనుగోలు చేసిన సంస్థకు ఐదేండ్లపాటు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఏటా రూటు ఫీజును పెంచే వెసులుబాటు రవాణా శాఖకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలు బస్సులను ఎలా నడిపించాలి? ఏ రూటుకు ఎంత మొత్తంలో ఫీజు చెల్లించాలి? ఎన్ని సర్వీసులు నడిపించాలి? తదితర అంశాలను నోటిఫికేషన్ తో పాటు విడుదల చేయనున్నారు.

Related Posts