అసంతృప్త ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు?
విజయవాడ,
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. వల్లభనేని వంశీ రాజీనామాతో మరికొందరు ఎమ్మెల్యేలు సయితం అదే బాటలో ఉన్నారన్న చర్చ పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా పార్టీని వీడే ఎమ్మెల్యేలపై కథనాలు ట్రోల్ అవుతున్నాయి. అయితే చంద్రబాబునాయుడు ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. వంశీతో ప్రారంభమయితే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాట పడతారేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.వల్లభనేని వంశీ కానీ మరెవరైనా కానీ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు అనివార్యం. నిజానికి వల్లభనేని వంశీ స్పీకర్ ఫార్మాట్ లో కనుక తమ్మినేని సీతారాంకు పంపించి ఉంటే ఆయన ఆమోదానికే మొగ్గు చూపేవారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉప ఎన్నికలను ఎదుర్కొనడం కష్టమని చంద్రబాబుకు తెలియంది కాదు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను విడివిడిగా కలసి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.వారితో మాట్లాడి వ్యక్తిగత సమస్యలతో పాటు ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న కేసుల వివరాలను కూడా చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఆర్థికంగా దెబ్బతిన్న వారిని కూడా ఆదుకుంటానని వారికి భరోసా ఇవ్వనున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అంతేకాకుండా తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో కూడా కొందరు నేతలు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది.దీంతో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ మరింత దూకుడుగా వెళ్లక మునుపే తాను రంగంలోకి పరిస్థితిని చక్క దిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఏకంతంగా చంద్రబాబు ఈ భేటీ జరపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారి సమస్యలను తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పటమే కాకుండా, వారికి భవిష్యత్తుపై కూడా చంద్రబాబు భరోసా ఇవ్వనున్నారని తెలుస్తోంది. మొత్తం మీద 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీకాకుండా మరెవరూ జారిపోకుండా చంద్రబాబు చర్యలకు దిగినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరి ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.