ఐదు అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఏ అంతస్తులో తీసుకుంటే మేలు అని ఆలోచనలో ఉండగా... చుట్టూపక్కల ఇప్పుడు వస్తున్నవన్నీ ఆకాశహర్మ్యాలే. గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోనే కనిపించే ఎత్తైన నివాస భవనాలు నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, కొంపల్లి ఇలా నగరవ్యాప్తంగా 10కిపైగా అంతస్తుల వరకు కడుతున్న అపార్ట్‌మెంట్లు ఆయా ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. అక్కడ కొనేవారిలో చాలామందికిది కొత్త అనుభవం. ఏ అంతస్తు ఎంపిక చేసుకోవడం మేలు?.. అనేది వారిలో ఉండే సందేహం.
స్థిరాస్తి కొనుగోలు అంటే ఎన్నో అంశాలను పరిశీలించాలి. బహుళ అంతస్తుల భవనంలో నివాసం అంటే కట్టేచోటు, రవాణా సౌకర్యం, చుట్టుపక్కల విద్య, వైద్య, వినోద సదుపాయాలతో పాటూ అద్దె ఎంత వస్తుంది.. భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలు.. అన్నింటికి మించి తమ బడ్జెట్‌లో ఉందా లేదా అనే విషయాలను చూస్తారు. ఏ అంతస్తులో ఇల్లు తీసుకోవాలనే దగ్గర మీమాంస పడుతుంటారు. వాస్తవానికి కొనుగోలుదారుల దృష్టిలో ఏ అంతస్తు ఎంపిక చేసుకోవాలనేదీ ముఖ్యమైందే. కింద, మధ్యలో, పై అంతస్తులో ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని.. కుటుంబ సభ్యుల ఇష్టాలు.. అభిరుచులు, ఆసక్తులను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నిర్మాణరంగ నిపుణులు సూచిస్తున్నారు.
సందడి ఎక్కువ..
* కొత్తగా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అధికంగా వస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఇటువంటి చోట్ల కింది అంతస్తుల్లోనూ ఎంపిక చేసుకోవచ్చు.
* ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో నిర్మిస్తున్నట్లయితే కింది అంతస్తుల ఎంపికపై వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులనుబట్టి నిర్ణయం తీసుకోవాలి.
* చుట్టూ నిర్మాణాలు ఉండటంతో గాలి, వెలుతురు పరిమితంగా ఉంటాయని గుర్తించాలి. గేటెడ్ కమ్యూనిటీల్లో దూరదూరంగా టవర్ల నిర్మాణంతో ఈ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
* భద్రతపరంగా... వచ్చిపోయేవారి సందడితో కింద అంతస్తుల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది.
* తరచూ ఇల్లు మారే వారికి సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
* ఒంటరితనం బాధిస్తున్న వారు... సందడి ఉండాలని కోరుకునే వారు కింది అంతస్తుల్లో నివసించవచ్చు.
* బాల్కనీల్లో నుంచి చూస్తే నలుగురు కన్పించడం.. అవసరమైతే అక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఉంటేనే కొందరికి సౌకర్యంగా ఉంటుంది. అటువంటి వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు.
రెండూ సమమే..
* ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లయితే మరేం ఆలోచించకుండా మధ్య అంతస్తులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
* సానుకూలం, ప్రతికూలం ఏమైనా ఇక్కడ సమంగానే ఉంటాయి. ఈ అంతస్తుల్లో కావాలంటే కాస్త త్వరపడాల్సిందే.
* ధ్వని కాలుష్యం వంటి సమస్యలు లేకుండా చూసుకునేందుకు కిటికీలు పకడ్బందీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
ప్రశాంతంగా..
* అత్యంత ఎత్తులో ఉండే పై అంతస్తులో నివసించే వారు బాల్కనీల్లోంచి చూస్తే నగరం మొత్తం కన్పిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
* గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి ప్రసరిస్తుంది. దోమలు ఉండవని చెబుతుంటారు.
* ఇతర అంతస్తుల వారి రాకపోకలు తక్కువే కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ధ్వని కాలుష్యం ఉండదు.
* పై అంతస్తులో నివసించడం అంటే హోదాగానూ చూస్తుంటారు.
* అగ్నిమాపక ఏర్పాట్లు ఉంటాయి. భద్రతపరంగా భయపడాల్సిన పనిలేదు.
* బిల్డర్.. నిబంధనల ప్రకారం పక్కాగా సౌకర్యాలన్నీ కల్పించారా లేదా అని చూసుకుని ఎంపిక చేసుకోవాలి.
ఇవీ చూడాలి..
* ఆరో అంతస్తు పైనుంచి ప్రతి చ.అడుగుకు రూ.10 నుంచి 15 ఎక్కువ చెల్లించాలి. పది అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది. తక్కువ అంతస్తుల్లో దీనికి భిన్నంగా ధరలు ఉంటాయి.
* పై అంతస్తుల్లో ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి విద్యుత్తు బిల్లుల వినియోగం పెరుగుతుంది. ఈ సమస్య లేకుండా .. కిటికీలకు ఏ సామగ్రి వినియోగిస్తున్నారనే దాన్ని బట్టి విద్యుత్తు వినియోగం పెరుగుదల ఆధారపడి ఉంటుంది.
* గాలులు వీచినప్పుడు అసాధారణ పరిస్థితుల్లోనూ తట్టుకునేలా కిటికీల సామగ్రి వాడుతున్నారా లేదా చూసుకోవాలి.
* అత్యవసరాల సమయంలో పై నుంచి కిందికి చేరుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు ఇప్పటికే అక్కడ నివసిస్తున్నవారు చెబుతున్నారు. అత్యంత వేగంగా పనిచేసే లిఫ్ట్‌లు ఉన్నాయో లేదో గమనించాలి.
* బాల్కనీల్లో నిర్మాణపరంగా రక్షణను చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.