హైదరాబాద్ ఆహార చరిత్రకు యూనెస్కో గుర్తింపు పై మేయర్ హర్షం
హైదరాబాద్ నవంబర్ 1
ప్రపంచంలోని క్రియేటీవ్ సిటీల జాబితాలో హైదరాబాద్ నగరాన్నిచేరుస్తూ యూనెస్కో ప్రకటించడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన అన్ని రకాల రుచికరమైన ఆహారం పదార్థాలు కేవలం హైదరాబాద్ నగరంలోనే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్రగల హైదరాబాద్ నగరంలో పాశ్చాత్య దేశాల్లో లభించే అన్ని రకాల రుచికరమైన ఆహారం, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆహార పదార్థాలు లభ్యమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కుత్బుషాహీలు, అసఫ్‌జాహీలు మధ్య ప్రాశ్చా దేశాలు, ఆఫ్రికా, అమెరికా దేశాలతో పాటు చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్ నగరానికి పరిచయం చేశారని తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన అనుభవజ్ఞులైన చెఫ్‌లను నిజాం నవాబులు హైదరాబాద్‌కు రప్పించిన విషయాన్ని మేయర్ గుర్తుచేశారు. భిన్న వర్గాలు, మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తూ మినీ భారతదేశంగా ఉండి అన్ని రాష్ట్రాలకు చెందిన స్వీట్లు, ఆహారపు అలవాట్లు నగరంలో సాధారణమయ్యాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీమ్ లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని, వీటితో పాటు నగరంలో బెంగాలి, గుజరాత్ తదితర ఉత్తరాది రాష్ట్రాల స్వీట్లు, ఆహార పదార్థాలు నగరంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌లో మాత్రమే దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరమని, ఈ విషయాన్ని గుర్తిస్తూ యూనెస్కో హైదరాబాద్ నగరాన్ని క్రియేటీవ్ సిటీల జాబితాలో చేర్చడం గర్వకారణమని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో ప్రత్యేకత సాధించిన హైదరాబాద్ నగరం క్రియేటీవ్ సిటీల జాబితాలో చేరడం హైదరాబాద్ పర్యాటకాభివృద్దికి మరింత దోహదపడుతుందని మేయర్ రామ్మోహన్ అభిప్రాయపడ్డారు.