సీఎం కేసీఆర్ చొరవతో రియల్ జోష్
త్వరలోనే రెరాలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్..
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 1 (న్యూస్ పల్స్)
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సౌకర్యవంతమైన పాలసీని అమలు చేస్తున్నారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రియల్ రంగంలోని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ అండ్ రెరా ఎక్స్కాన్ రోడ్షో కార్యక్రమానికి సోమేష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బిల్డర్లు, డెవలపర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన హామీ ఇచ్చారు.
సర్టిఫికేషన్ కోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో డేటాను సమర్పించిన వారు రెరాలో సర్టిఫికేషన్ కోసం సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలుదారులతోపాటు బిల్డర్, డెవలపర్లకూ లబ్ది చేకూరేలా రెరా పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన ప్రాజెక్టులు, డెవలపర్ల వద్ద కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంటుందని, కొనుగోలుదారులు జాగ్రత్త వహించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాలను చూపుతామని, తద్వారా రాష్ట్రంలో రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికోసం సీఐఐ, క్రెడాయ్, ట్రెడా, కాంట్రాక్టర్లందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ఆయా అసోసియేషన్లు వినతులిచ్చారని, వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.
వర్క్ కాంట్రాక్టు పన్నును 18 శాతానికి తగ్గించాలని కోరారని, దీనిపై సీఎం కేసీఆర్ ఎంతో చొరవ చూపి జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదించి చాలా వరకు పన్ను తగ్గించారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరికి సమస్య వచ్చినా బాధ్యతగా తీసుకుని పరిష్కరం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా అనుమతులివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సాంకేతికతను వినియోగించి డెవలపర్లకు ఇచ్చే అనుమతులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ కన్వీనర్ సీ శేఖర్రెడ్డి, ఎక్స్కాన్-2019 స్టీరింగ్ కమిటీ మెంబర్లు వీ.జీ శక్తి కుమార్, టీ.ఆర్ భరతన్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్రావు, ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు, సీఐఐ కో కన్వీనర్ ఎస్ ఎన్.రెడ్డి, మెయిల్ డైరెక్టర్ రవిరెడ్డి పాల్గొన్నారు.