కర్నూలులో మళ్లీ కేఈ, కోట్ల
కర్నూలు,
ఆ రెండు కుటుంబాలు రాజకీయండా ఉత్తర, దక్షిణ ధృవాలు. ఒకరు ఒక పార్టీలో ఉంటే.. మరొక కుటుంబం మరో పార్టీ నుంచి చక్రం తిప్పింది. దశాబ్దాలుగా రాజకీయ వైరంతో ఈ కుటుంబంలో పొలిటికల్ పవ నాలు హీట్ గా సాగాయి. అయితే, ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీని మట్టికరిపించాలనే ఏకైక వ్యూ హంతో చంద్రబాబు ఈ రెండు కుటుంబాలను ఒకే వేదికపైకి తెచ్చారు. కలిసి పోటీ చేసేలా కలిసి ప్రచారం చేసేలా వ్యూహాత్మక రాజకీయం నడిపించారు. అయితే, ప్రజలు ఈ స్నేహాన్ని మెచ్చుకోలేదు. ఎన్నికల్లో అవకాశం కల్పించలేదు. ఈ రెండు కుటుంబాలను కూడా ఘోరంగా ఓడించారు. అవే.. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ, కోట్ల కుటుంబాలు.కేఈ కృష్ణమూర్తి టీడీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అందులోనే ఉన్నారు. ఇక, కోట్ల సూర్యప్రకా శ్‌రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి . అయితే, ఇటీవల ఎన్నికలకు ముందు వరకు కోట్ల కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. అయితే, రాజకీయంగా కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకపోవడం, వైసీపీలోకి వెళ్లాలంటే అహం అడ్డు వచ్చి.. కోట్ల కుటుంబం రాజీ పడింది. చంద్రబాబు కూడా ఈ కుటుంబాన్ని పార్టీలోకి తీసుకునేందుకు మొగ్గు చూపించారు. ఈ క్రమంలోనే కేఈని ఒప్పించారు.అదే సమయంలో కేఈ వృద్ధాప్య సమస్యల కారణంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని, తన కుమారుడు శ్యాం బాబుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దీనికి చంద్రబాబు ఓకే అన్నారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ, కేఈ శ్యామ్ బాబు సహా ఆయన బాబాయిలు ఇదే జిల్లాలో టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. నిన్న మొన్నటి వరకు విభేదాలతో ఉన్న ఈ కుటుంబాలు భుజం భుజం రాసుకుని ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాయి. అయినా జగన్ సునామీ ముందు వీరు ఓడిపోయారు. ఎవరినైతే చంపించారని శ్యామ్ బాబు ఆరోపణలు ఎదుర్కొన్నారో.. అదే చెరుకుల పాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిపై పోటీ చేసి 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. డోన్‌లో శ్యాంబాబు బాబాయ్ కేఈ ప్రతాప్ రెడ్డి కూడా ఓడిపోయారు.ఇక, కోట్ల ఫ్యామిలీ కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా మళ్లీ మాట్లాడుకోవడం మానేశాయి. అంతేకాదు, టీడీపీలోనూ యాక్టివ్‌గా ఉండడం మానేశాయి. పార్టీని పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అనేక ఉద్యమాలకు, నిరసనలకు పిలుపు ఇస్తున్నా.. పార్టిసిపేట్ చేయడం లేదు. శ్యాంబాబు హైదరాబాద్‌కే పరిమితం అయినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఈ కుటుంబాలు ఏం చేస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడున్న వాతావరణంలో వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. వెళ్లినా.. ఆ పార్టీ ఆహ్వానించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ కుటుంబాలు రెండూ కూడా బీజేపీవైపు చూస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి